సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మంగాంధీచౌక్: ప్రజల సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం విభాగం ఎస్పీ జి.బిక్షంరెడ్డి, ఎస్‌బీఏ ఆర్‌ఎం రాజశేఖర్ సూచించారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పేరిట నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జెడ్పీలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రోజుకో కొత్త రూపంలో సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. డిజిటల్ అరెస్టు, కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగిందని, లాటరీలో డబ్బు గెలిచారంటూ వచ్చే ఫోన్లు, మెసేజ్‌లను నమ్మొద్దని వారు ఈ సందర్భంగా సూచించారు. మోసపూరిత లావాదేవీలను గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడమే కాక ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. సైబర్ క్రైం ఖమ్మం డీఎస్పీ ఫణీంద్ర, సీఐ కె.నరేష్, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ఫయాజ్ బాషా, మేనేజర్ షేక్ ఇబ్రహీంతో పాటు ఎస్సైలు రంజిత్‌కుమార్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


