‘సీతారామ’లో కీలక మార్పులు
● గతంలో మెయిన్ పంపుహౌజ్, కాల్వలకే పరిమితం ● ఇప్పుడు పంపిణీ వ్యవస్థను భాగం చేస్తూ నిధులు ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టులో కీలక మార్పులు చేస్తున్నామని, ప్రాజెక్టులో పంపిణీ వ్యవస్థను భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం నిధులు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన జిల్లా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును మెయిన్ పంప్ హౌజ్‌లు, కాల్వలకే పరిమితం చేయడంతో క్షేత్రస్థాయిలో రైతులకు నీరు అందడం లేదన్నారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంపిణీ వ్యవస్థను కూడా ప్రాజెక్టులో భాగం చేస్తూ నిధులు కేటాయించినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల ద్వారా నీరు అందించేలా ప్రాజెక్టును విస్తరిస్తామని, పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో కాల్వల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 25వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అంతేకాక జూలూరుపాడు టన్నెల్‌కు కూడా టెండర్లు పిలిచామని, ఇందులో 10 కి.మీ. మేర అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. టన్నెల్ పనులు పూర్తయితే నీరు పాలేరు లిఫ్ట్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌లోకి వస్తుందన్నారు. ఇక సీతమ్మ సాగర్‌కు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ రాగా, ఎన్‌జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) క్లియరెన్స్ రావాల్సి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు.


