
ఆగని దందా
అదే పంథా..
కింద రిజిస్ట్రార్ కార్యాలయం,
పై అంతస్తులో డాక్యుమెంట్
రైటర్ల ఆఫీస్‌లు
జిల్లాలో గతంలో పనిచేసిన అధికారులను మార్చి కొత్త వారిని నియమించినా అవినీతి ఆగకపోవడం గమనార్హం. తాజాగా ఏసీబీ అధికా రుల వలలో చిక్కిన ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ జె.అరుణ వ్యవహార శైలిపై కొన్ని నెలలుగా ఆరోపణలు వస్తున్నాయి. మూడు నెలల క్రితం ఆమైపె కొందరు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా తీరు మార్చుకోని ఆమె.. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి టార్గెట్లు విధించి వారి ద్వారా వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఏకంగా వెండర్లకు స్టాంప్‌లు విక్రయించడంలోనూ అదనపు వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులొచ్చాయి. ఇవన్నీ భరించలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పట్టుబడడం గమనార్హం.
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే వాటిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే, ఈ శాఖలో ఎన్ని మార్పులు, చేర్పులు చేసినా.. సంస్కరణలు తీసుకొచ్చినా గాడిన పడడం లేదన్న విమర్శలున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లు, దందా చర్చనీయాంశంగా మారుతోంది. కొందరు అధికారుల తీరుతో శాఖ మొత్తానికి మచ్చ పడుతోందని చెబుతున్నారు. అవినీతిపరులైన అధికారుల స్థానాలు మార్చినా, జిల్లాలు దాటించినా పాత వాసనలు మాత్రం వీడడం లేదు. వైరా కార్యాలయంలో ఒకేరోజు 100మేర డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కాగా.. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ జె.అరుణ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.30వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుపడ్డారు. ఇలాంటి ఘటనలతో శాఖలో అవినీతి దందా ఆగలేదని స్పష్టమవుతోంది.
ప్రైవేట్ సైన్యం అండతో...
కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చే భూయజమానులకు డాక్యుమెంట్లు సమకూర్చేందుకు రైటర్లు ఉంటారు. ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఏళ్లుగా జీవనాధారం పొందుతున్నారు. అయితే, వీరిని ఆలంబనగా చేసుకుని సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏ పని అయినా డాక్యుమెంట్ రైటర్ ద్వారా వస్తే త్వరగా అవుతుందని, నేరుగా వెళ్తే పని కాదనే నమ్మకం ఏర్పడడంతో భూయజమానులంతా తొలుత వీరిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఓ అధికారి.. ప్రైవేట్ వ్యక్తులను డాక్యుమెంట్ రైటర్లుగా వినియోగించుకున్నారు. వీరు ఏకంగా ప్రభుత్వ స్థలాన్నే రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సదరు ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై వేటు పడింది. సోమవారం కూడా డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిగా వ్యవహరించి సబ్ రిజిస్ట్రార్ తరఫున నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్ల ఆగడాలు పెరిగిపోయాయని, వారు అధికారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ.. దస్త్రాల రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు సైతం తమ చేతికి మట్టి అంటకుండా వీరి ద్వారానే వసూళ్లకు పాల్ప డుతున్నారనే అంశం నిరూపితమవుతోంది.
అడుగడుగునా అక్రమాలే
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలు
ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్
జిల్లాలు మార్చినా మారని తీరు
ఏసీబీ అధికారుల వలలో చిక్కిన
ఖమ్మం రూరల్ సబ్‌రిజిస్ట్రార్
జిల్లాలో అనేకం..
గత నాలుగైదేళ్లలో జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసి సస్పెండ్‌కు గురయ్యారు. ఇక 2020 మే నెలలో మధిరలోని ఎకై ్సజ్ కార్యాలయ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై వేటు పడింది. వీటితోపాటు అనేక స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి పలువురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్లకు గురైన ఘటనలు ఉన్నాయి. కూసుమంచి, వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలు బయటపడడంతో విధుల నుంచి తొలగించారు. ఈ అవినీతిని నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా శాఖను ప్రక్షాళన చేస్తూ సీనియర్ అసిస్టెంట్ నుంచి సబ్‌రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ స్థాయి అధికారులందరినీ ప్రస్తుత స్థానాల నుంచి పక్క జిల్లాలకు బదిలీ చేయించారు.

ఆగని దందా