
శుద్ధి.. అబద్ధం
● జిల్లాలో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు ● మినరల్ పేరుతో జనరల్ వాటర్ అమ్మకం ● ఏ ప్లాంట్‌లోనూ కనిపించని నిపుణులు, పరీక్షలు ● అయినా తనిఖీల మాటే ఎత్తని అధికార యంత్రాంగం
ఖమ్మంరూరల్: ప్రజలకు ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ, ఆపై మండుతున్న ఎండలతో మినరల్ వాటర్ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నకొందరు గల్లీకొకటి చొప్పున మినరల్ వాటర్ పేరిట ప్లాంట్లు ఏర్పాటుచేసి సాధారణ నీటినే అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ప్లాంట్లు అయితే కిరాణం షాపులు, చిన్న బడ్డీ కొట్లు, రోడ్ల వెంట షెడ్లలో ఏర్పాటుచేయడం గమనార్హం. కేవలం ఒక పెద్ద ట్యాంక్, మరో రెండు బాయిలర్ మాదిరి ట్యాంకులు.. అన్నింటినీ అనుసంధానిస్తూ పైప్‌లు ఏర్పాటుచేసి ఇవే మినరల్ వాటర్‌గా అమ్ముతున్నారు. జిల్లాలో ఇలాంటి వెయ్యికి పైగా ప్లాంట్లు ఉన్నాయని తెలుస్తుండగా.. పదుల సంఖ్యలో కూడా అనుమతి లేవని సమాచారం. అయినప్పటికీ అధికారులు మిగతా సమయాల్లో ఏమో కానీ కనీసం వేసవిలోనైనా ఏ ప్లాంట్‌లోనూ తనిఖీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఫిల్టర్ నీరే...
వాటర్ ప్లాంట్లలో నీరు శుద్ధి చేయకపోగా సాధారణ ఫిల్టర్ల నీటినే క్యాన్లలో నింపి సరఫరా చేయడం పరిపాటిగా మారింది. వేసవి తాపం నుంచి బయటపడేందుకు చల్లని నీటి కోసం వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తే మరింత ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. గల్లీలో ఉన్న డబ్బా కొట్టు మొదలు హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లు, శుభకార్యాలకు జనరల్ వాటర్‌నే మినరల్ వాటర్ పేరిట సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు డబ్బు చెల్లించి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లవుతోంది.
నిబంధనలకు చెల్లుచీటీ
జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. ఏ ప్లాంట్‌లో కూడా నీటిశుద్ధికి కనీస ప్రమాణాలు పాటించడం లేదని చెప్పొచ్చు. నాలుగైదు మినహాయించి మిగతా ప్లాంట్లకు బీఎస్‌ఐ(బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్) గుర్తింపు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇళ్లకై తే ఒక ధర, హోటళ్లు, బార్లకై తే ఇంకాస్త తక్కువ ధరకే నీటి అమ్మకాలు చేస్తున్నారు. ఇలా ఇంటింటికీ సాధారణ నీరే సరఫరా చేస్తున్న నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఏదీ?
వాటర్ ప్లాంట్లను నిత్యం తనిఖీ చేయాల్సిన అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ప్లాంట్ల విషయంలో మున్సిపాలిటీ, రెవెన్యూ, ఆహార భద్రత, పర్యావరణ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర అధికారులు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలే లేవు. తరచూ పర్యవేక్షిస్తూ నీటిని ప్రయోగశాలలో పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా తనిఖీ చేయడం.. ఆపై చర్యల విషయంలో మీనమేషాలు లెక్కించడం పరిపాటిగా మారింది. ఇకనైనా అధికారులు స్పందించి అనధికారిక మినరల్ వాటర్ ప్లాంట్లపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
నిబంధనలు ఇలా....
వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే, ప్లాంట్లలో ల్యాబ్ ఏర్పాటుచేసి కెమిస్ట్‌లు, మైక్రో బయాలజిస్టులను నియమించాలి. వీరి ఆధ్వర్యాన ప్రతీరోజు నీటి పరీక్షలు చేశాకే సరఫరా చేయాలి. క్యాన్లను పొటాషియం పర్మాంగనేట్‌తో శుభ్రం చేయాలి. అలాగే, నీటిని నింపే ముందు క్యాన్‌ను అల్ట్రా వైరస్ రేస్‌తో శుభ్రపర్చాలి. అంతేకాక, సిబ్బంది చేతులకు గ్లౌస్‌లు వాడాలి. శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన పెద్ద ట్యాంక్‌లో నింపి ఓజోనైజేషన్ చేయాలి. అలాగే, క్యాన్లపై ధర, ప్లాంట్ పేరు, ఇతర వివరాలన్నీ ముద్రించాలి. కానీ జిల్లాలోని ఏ ప్లాంట్ నుంచి సరఫరా అవుతున్న క్యాన్‌ను పరిశీలించినా ఇవేవీ కనిపించవు.

శుద్ధి.. అబద్ధం