
20 పడకలతో కోవిడ్ వార్డు
ఖమ్మంవైద్యవిభాగం: దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయనే సమాచారంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు సోమవారం ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ ప్రత్యేక వార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇరవై పడకలతో ఈ వార్డును ఏర్పాటు చేయగా, అనుమానిత కేసులు ఉంటే వారికి చికిత్స చేయనున్నారు. అయితే, కరోనా సోకినట్లు గుర్తించడానికి జిల్లాలో ర్యాపిడ్ కిట్లు కానీ ఆర్‌టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పా ట్లు లేకపోవడం గమనార్హం. ఈనేపథ్యాన జిల్లాకు 3వేల కిట్లు సరఫరా చేయాలని ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించడమే కాక గుంపులు గుంపులుగా సంచరించొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, శానిటైజర్‌తో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వైద్యులను సంప్రదించాలని అవగాహన కల్పిస్తున్నారు.
ఏకలవ్య కళాశాలల్లో
వంద శాతం సీట్లు భర్తీ
భద్రాచలం అర్బన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలల్లో జూనియర్ ఇంటర్‌లో ఖాళీగా ఉన్న 302 సీట్ల భర్తీకి సోమవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని ఈఎంఆర్‌ఎస్ కళాశాలలో కన్వీనర్ నాగేశ్వరరావు, ఆర్‌సీఓ అరుణకుమారి నేతృత్వాన కౌన్సెలింగ్ ఏర్పాటుచేయగా 577 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న 302 సీట్లలో మెరిట్ ప్రకారం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు భద్రాచలం కళాశాల ప్రిన్సిపాల్‌వందనాబీ దాస్ తెలిపారు. దీంతో కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు విజయ్‌కుమార్, సంజయ్ మల్కర్, ప్రశాంత్, నితిన్‌సింగ్, విజయేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చేనెలలో 30వరకు బియ్యం పంపిణీ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రేషన్‌షాప్‌ల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని జూన్‌లో ఒకేసారి అందించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన పలు రేషన్‌షాపులను తనిఖీ చేసి బియ్యం నిల్వలు, షాప్‌ల సామర్ధ్యాన్ని పరి శీలించి మాట్లాడారు. జిల్లాలో 4,15,905 కార్డులకు గాను 12,03,943మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. వీరికి 21,915.321మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తామని డీసీఎస్‌ఓ వెల్లడించారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం ఇవ్వనున్న నేపథ్యాన జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పంపిణీ ఉంటుందని తెలిపారు.
బాలికల సంరక్షణ
అందరి బాధ్యత
ఖమ్మం సహకారనగర్: బాలికలు, మహిళ రక్షణను అందరూ బాధ్యగా భావించాలని జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ సూచించారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్‌లో జిల్లా విద్యాశాఖ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆడపిల్లల అక్రమ రవాణా, డ్రగ్స్ కారణంగా ఎందరో అమ్మాయిలు, అబ్బాయిల జీవితాలు నాశనమవుతున్నాయని తెలిపారు. ఈనేపథ్యాన విద్యార్థినీ, విద్యార్థులతో సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులు వారి సామాజిక, మానసిక స్థితిగతులను పరిశీలిస్తూ రక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా జీసీడీఓ అన్నమణి, హెచ్‌ఎం అజిత, ప్రజ్వల సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్, రిసోర్స్ పర్సన్ సురేష్‌కుమార్‌తో పాటు రాము తదితరులు పాల్గొన్నారు.

20 పడకలతో కోవిడ్ వార్డు