
పలువురు సీఐల బదిలీ
ముగ్గురు ఐజీ కార్యాలయానికి అటాచ్
ఖమ్మంక్రైం: జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం త్రీటౌన్ సీఐగా పనిచేస్తున్న దోమల రమేష్‌ను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ సీఐగా, ట్రాఫిక్ సీఐ మోహన్‌బాబును ఖమ్మం త్రీటౌన్ సీఐగా, ఖమ్మం వన్‌టౌన్ సీఐ ఉదయ్‌కుమార్‌ను ఖమ్మం సీసీఎస్‌కు బదిలీ చేశారు. అలాగే, వెయిటింగ్‌లో ఉన్న తాటిపాముల కరుణాకర్‌ను ఖమ్మం వన్‌టౌన్ సీఐగా కేటాయించారు. టాస్క్‌ఫోర్స్ సీఐలు రామకృష్ణ, తిరుపతి, సీసీఎస్ సీఐ బాలాజీని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఖమ్మం ట్రాఫిక్ సీఐ–1గా మాత్రం ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు.
నాణ్యమైన విత్తనాలే
అందించాలి
కూసుమంచి: వర్షాకాలం సీజన్ సమీపిస్తున్నందున డీలర్లు నాణ్యమైన విత్తనాలు సమకూర్చుకుని రైతులకు సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని కూసుమంచి, పాలేరు, నాయకన్‌గూడెంల్లోని ఎరువులు, విత్తనాల దుకాణాలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన డీలర్లకు సూచనలు చేశారు. రికార్డుల్లో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. ఎవరైనా అనుమతి లేని విక్రయాలు చేపట్టినా, రైతులకు పూర్తి వివరాలతో రశీదులు ఇవ్వకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఏఓ వాణి పాల్గొన్నారు.
సదరమ్ క్యాంప్‌నకు 233 మంది
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంప్‌నకు 233మంది దివ్యాంగులు హాజరయ్యారు. మొత్తం 325 మంది స్లాట్ బుక్ చేసుకోగా 233 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. సదరమ్ సర్టిఫికెట్ల స్థానంలో యూడీఐడీ కార్డులు జారీ చేస్తుండగా, దివ్యాంగులకు వైకల్య పరీక్షలు నిర్వహించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ మేరకు అర్హత సాధించిన వారి చిరునామాకు నేరుగా కార్డులు అందుతాయని అధికారులు తెలిపారు.
భూగర్భ కేబుల్‌తో
విద్యుత్ సరఫరా
మధిర: మధిరలో భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం విద్యుత్, ఆర్‌అండ్ బీ, మున్సిపల్ అధికారులు పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో సమావేశం కాగా, ఖమ్మం ఎస్‌ఈ శ్రీనివాసచారి మాట్లాడారు. ఆత్కూరు క్రాస్ నుంచి మధిరలోని నందిగామ బైపాస్, ఆర్‌వీ కాంప్లెక్స్ నుంచి బస్టాండ్ వరకు భూగర్భ కేబుల్‌తో అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఏజెన్సీ ద్వారా సిద్ధమవుతున్న డీపీఆర్‌ను ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ డీఈలు బండి శ్రీనివాసరావు, హీరాలాల్, ఆర్‌అండ్‌బీ డీఈ శంకర్‌రావు, మున్సిపల్ డీఈ నరేష్‌రెడ్డి, వివిద శాఖల ఉద్యోగులు అనురాధ, నాగమల్లేశ్వరరావు, అనిల్‌కుమార్, కన్సల్టెన్సీ ప్రతినిధి భరత్‌భూషణ్ పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర
కల్లూరు: ధాన్యం సరైన తేమ శాతం వచ్చేవరకు ఆరబోసి, తాలు లేకుండా తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని జిల్లా పౌరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత తెలిపారు. కల్లూరు మండలం పుల్లయ్యబంజర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య, ఆర్‌డీఓ ఎల్.రాజేందర్, డీపీఎం దర్గయ్యతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కొనుగోళ్లలో జాప్యంతో ఇబ్బంది ఎదురవుతోందని, మిల్లర్లు తరుగు పేరుతో కోత విధిస్తున్నారని రైతులు వాపోయారు. ఈమేరకు డీఎం మాట్లాడుతూ సరిపడా గన్నీ బస్తాలు, లారీలు సమకూరుస్తామని తెలిపారు. మార్కెట్ చైర్మన్ భాగం నీరజ తదితరులు పాల్గొన్నారు.

పలువురు సీఐల బదిలీ