పెనుబల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పెనుబల్లి మండలం చౌడవరం గ్రామానికి చెందిన సడియం వంశీ వీఎం.బంజర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం పాఠశాల నుండి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా పెనుబల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపం వద్ద లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్ తరలించారు. వంశీ కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న ఉపాధ్యాయులు రూ.లక్షకు పైగా నగదు సేకరించి చికిత్స నిమిత్తం అందజేశారు. అయినా ఫలితం లేకపోగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటనపై సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
కొణిజర్ల: ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్దుడు మృతి చెందాడు. ఎస్‌ఐ జి.సూరజ్ తెలిపిన వివరాలు... మండలంలోని పల్లిపాడుకు చెందిన గాజనబోయిన శేషయ్య(78) రోజులాగే శుక్రవారం ఉదయం వాకింగ్ కోసం రోడ్డు దాటుతుండగా వైరా వైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శేషయ్య తలకు తీవ్ర గాయం కాగా, ద్విచక్రవాహనం నడుపుతున్న వైరా మండలం దాచాపురానికి వి.వెంకటేశ్వరరావుకు కూడా గాయపడ్డాడు. ఈమేరకు శేషయ్యను 108లో ఖమ్మం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెల్లడించారు. కాగా, సీపీఎం సానుభూతిపరుడైన శేషయ్య మృతదేహం వద్ద వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, నాయకులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, చింతనిప్పు చలపతిరావు నివాళులర్పించారు.
గంజాయి స్వాధీనం, విక్రేత అరెస్ట్
పెనుబల్లి: మండలంలోని వీఎం.బంజర్ బస్టాండ్‌లో గంజాయి కలిగిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన బోయిన వెంకటరమణ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి మండలంలోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నాడు. ఈమేరకు బస్టాండ్‌లో చేపట్టిన తనిఖీల్లో ఆయన పట్టుబడగా 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు.