● జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం ● ఆందోళనకు గురైన రైతులు
ఖమ్మంవ్యవసాయం/తిరుమలాయపాలెం/ఏన్కూరు: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో శనివారం ఉదయం జిల్లాలోని పలుచోట్ల వర్షపు జల్లులు కురిశాయి. దీంతో రైతులు కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు వస్తుండగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈమేరకు శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తూ ఖమ్మం, జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. దీంతో కల్లాల్లో మిర్చి, మొక్కజొన్న ఆరబెట్టిన రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షం మొదలుకాగానే రైతులు కల్లాలకు పరుగులు తీసి కల్లాలపై టార్పాలిన్లు కప్పారు. అలాగే, మామిడి పూత, కాత దశలో ఉండడంతో రైతులు ఆందోళనకు గురైనా వర్ష ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చు కున్నారు. అయితే, మరో రోజులు వర్షాలు కురిసే అవకాశముందనే సూచనలతో రైతుల్లో కలవరం వీడడం లేదు.