కేఎంసీలో పరిపాలన వికేంద్రీకరణకు ఏర్పాట్లు
● నాలుగు జోన్ల ఏర్పాటు.. ఆపై సెంట్రల్ ఆఫీస్‌గా కేఎంసీ ● ప్రతీ జోన్‌లో నాలుగు విభాగాలతో కార్యాలయం ● శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ సేవలు అక్కడి నుండే
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను మరింత చేరువ చేసేలా జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని పాలకవర్గం, అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల మాదిరిగా ఖమ్మంలో కూడా జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించగా.. పనులు వేగిరమయ్యాయి. నగరానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షణ దిక్కుల్లో నాలుగు జోన్లు ఏర్పాటుచేసి.. మధ్యలో ఉన్న కేఎంసీ కార్యాలయాన్ని కేంద్ర ప్రధాన కార్యాలయంగానే కాక ఐదో జోన్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. ఈమేరకు నాలుగు ప్రాంతాల్లో జోనల్ కార్యాలయాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భవనాలను కమిషనర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం పరిశీలించారు.
ఐదు లక్షల మంది జనాభా
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 60డివిజన్ల పరిధిలో సుమారు ఐదు లక్షల మంది జనాభా నివాసముంటున్నట్లు అధికారిక అంచనా. ఇందులో ప్రతీ లక్షకు పైగా జనాభాకు ఒక జోనల్ కార్యాలయం చొప్పున నగరంలో మొత్తం నాలుగు కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికే నగరం జనాభా, విస్తీర్ణం, ఇతర అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించగా కమిషనర్ పరిశీలించి, ఎక్కడెక్కడ కార్యాలయాల ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందో గుర్తించారు.
వినతుల స్వీకరణ, పరిష్కారం అక్కడే..
ప్రస్తుతం నగర నలుమూలల ప్రజలకు ఏ సమస్య ఎదురైనా కేఎంసీ కార్యాలయానికి రావా ల్సి వస్తోంది. రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ సహా ప్రతీ సమస్యపై ఇక్కడే ఫిర్యాదులు ఇస్తుండగా.. వాటిని పరిశీలించి ఆయా విభాగాల అధికారులకు పంపించి, పరిష్కరించడానికి వారాలు పడుతోంది. ఇప్పుడు జోనల్ ఆఫీసులు ఏర్పాటు చేస్తే అక్కడే సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి విభాగాల వారీగా సిబ్బందితో పరిష్కరించడం సులువవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎవరెవరు ఉంటారు?
ప్రతీ జోనల్ కార్యాలయంలో ఒక ఏఈఈ(ఇంజనీరింగ్) అధికారి, టీపీఎస్, ఆర్‌ఐతో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ విధులు నిర్వర్తించనున్నారు. వీరి పరిధిలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, వర్కర్లు, బిల్లు కలెక్టర్లు సైతం ఉంటారు. ఇక ప్రతీ రెండు డివిజన్లకు ఒక వార్డ్ ఆఫీసర్‌ను కూడా కేటాయిస్తారు. జోనల్ కార్యాలయాలకు కేటాయించిన ఉద్యోగులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పౌర సేవలు అందించనున్నారు.
నలుదిక్కులా..
జోనల్ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం పరిశీలించారు. ఉత్తరాన ఏర్పాటు చేసే కార్యాలయం కై కొండాయిగూడెం జీపీలో, తూర్పున ఎస్‌బీఐటీ వద్ద పబ్లిక్ హెల్త్ ఆఫీస్‌లో, పడమర(త్రీటౌన్)కు సంబంధించి ప్రస్తుతం 25వ డివిజన్ కమ్యూనిటీ హాల్‌లో, దక్షిణ ప్రాంతానికి సంబంధించి పాత మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. త్రీటౌన్ ప్రాంతానికి సంబంధించి అనువైన భవనం లభించాక పడమర జోన్ కార్యాలయాన్ని అందులోకి మార్చే అవకాశముంది. ఇవన్నీ ఏర్పాటయ్యాక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నాలుగు జోనల్ కార్యాలయాలను కలుపుతూ సెంట్రల్ హెడ్ ఆఫీస్(జోన్–5)గా అవతరిస్తుంది.
పది రోజుల్లో ప్రారంభిస్తాం..
జోనల్ కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే భవనాలను గుర్తించాం. వీటి మరమ్మతులు చేయించి కార్యాలయ కార్యకలాపాలకు అనువుగా తీర్చిదిద్దుతాం. ఏప్రిల్ 1వ తేదీ నాటికి కార్యాలయాలు సిద్ధం చేసి జోనల్ వ్యవస్థను ప్రారంభిస్తాం. ఆతర్వాత అక్కడ నుండే ఆయా ప్రాంతాల ప్రజలకు పౌరసేవలు అందుతాయి.
– అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ