● దరఖాస్తులు ఇవ్వడం.. ఆపై ప్రదక్షిణలు ● కలెక్టరేట్‌లో 14 నెలల్లో 1,084 దరఖాస్తుల పెండింగ్ ● మండల స్థాయి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నా అదే పరిస్థితి
ప్రతీ వారం కిటకిటే..
ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు. మండల స్థాయిలో తమ గోడు వెల్లబోసుకున్నా పరిష్కారం కాని సమస్యలపై బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కిటకిటలాడుతోంది. వందల సమస్యలు ఈ ప్రజావాణిని తాకుతున్నాయి. ఇక్కడ కొన్నింటిని వెంటనే పరిష్కరిస్తున్న ఉన్నతాధికారులు.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన వాటిని ఆయా మండలాలకు పంపుతున్నారు. అయితే అక్కడికి వెళ్లే దరఖాస్తులు త్వరగా పరిష్కారం కావడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చేసేదేమీ లేక మళ్లీ ఉన్నతాధికారులకు సమస్యను నివేదించేందుకు వస్తున్నామని చెబుతున్నారు.
భూ సమస్యలే అధికం..
జిల్లా వ్యాప్తంగా అత్యధిక మంది ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఇస్తున్నారు. ఏడాది కాలంలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై 1,876 మంది ఫిర్యాదు చేయగా.. 1,141 దరఖాస్తులను డిస్పోజ్ చేశారు. 51 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయి. 684 దరఖాస్తులు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. భూ సమస్యలు కొన్ని సంక్లిష్టంగా ఉంటుండగా పరిష్కారానికి కొంత సమయం పడుతోంది. తమ భూమి ఆక్రమించారని, పాస్‌బుక్‌లో పేరు నమోదు కాలేదని, తన భూమిని వేరే వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఇలాంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి. వాటిని ఆయా తహసీల్దార్లకు పంపిస్తుండగా అక్కడ పరిష్కారం కాకపోవడంతో విసుగెత్తిన బాధితులు ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పెండింగ్‌లో 1,084 అర్జీలు..
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 14 నెలల్లో వచ్చిన 3,642 అర్జీలకు 2,453 పరిష్కారం కాగా.. 1,084 పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కొన్ని శాఖలకు సంబంధించి అసలే పరిష్కారం కాకపోవడం గమనార్హం. టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ (తెలంగాణ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)కి 17 అర్జీలు రాగా.. అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. టీజీఎస్ ఆర్టీసీకి వచ్చిన 12 దరఖాస్తులదీ అదే పరిస్థితి. దేవాదాయ శాఖలో 7 ఫిర్యాదులు రాగా..రెండే పరిష్కారమయ్యాయి. స్టేట్ ఆడిట్‌కు సంబంధించి రెండుకు రెండు, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ)లో 38 దరఖాస్తులకు 35, ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో 123 దరఖాస్తులకు 90, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో 157కు 123, కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో 86కు 73, సింగరేణిలో 23 దరఖాస్తులకు 19 పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాది కాలంలో 20లోపు వచ్చిన దరఖాస్తులను కూడా పరిష్కరించకపోవడం గమనార్హం.
మండలాల్లోనూ అదేతీరు
స్థానికంగా మండలాల్లో పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలపై ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిని గమనించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ గతేడాది ఆగస్ట్ నుంచి మండల స్థాయి సమస్యలను అక్కడే పరిష్కరించేందుకు మండలాల్లో ప్రజావాణిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 21 మండలాల్లో 994 ఫిర్యాదులు రాగా.. 811 పరిష్కరించారు. 183 పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూకి సంబంధించి 657 దరఖాస్తులు రాగా.. 558 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. 99 పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఇతర శాఖలకు సంబంధించి 337 దరఖాస్తులు రాగా.. 253 పరిష్కారం అయ్యాయి. 84 పెండింగ్‌లో ఉన్నాయి.
శాఖ మొత్తం డిస్పోజ్ ఫార్వర్డ్ పెండింగ్
36 శాఖలు 1,304 936 42 326
రెవెన్యూ 1,876 1,141 51 684
ఎంపీడీఓలు 462 376 12 74
మొత్తం 3,642 2,453 105 1,084
గత ఏడాది జనవరి నుంచి
ఈ ఏడాది మార్చి 10 వరకు
కలెక్టరేట్ ప్రజావాణికి అందిన
దరఖాస్తుల పరిస్థితి
కలెక్టరేట్ నుంచి ఎండార్స్ చేసిన దరఖాస్తుల్లో ఎక్కువ పెండింగ్‌లో ఉన్న తహసీళ్లు
తహసీల్ దరఖాస్తులు
ఖమ్మంఅర్బన్ 123
కూసుమంచి 73
రఘునాథపాలెం 60
తిరుమలాయపాలెం 28
పెనుబల్లి 28
కల్లూరు 27
వేంసూరు 25
కారణం తెలియక..
కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి మొక్కుబడి కార్యక్రమంగా మారిందనే చర్చ సాగుతోంది. ప్రతి సోమవారం ఫిర్యాదుదారులు రావడం, అధికారులు దరఖాస్తులు స్వీకరించడం మామూలైంది. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పలు ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొని ఆర్జీలను స్వీకరించి.. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలపాలి. కానీ దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు.. సంబంధిత కార్యాలయాలకు పంపడంతోనే సరిపోతోంది. అక్కడ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడం ఫిర్యాదుదారులకు తలకు మించిన భారమవుతోంది.