ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ఇల్లెందు మండలం పూబల్లిలోఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత ఇల్లెందు జేకే బస్టాండ్ వద్ద 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి, అనంతరం బోయితండాలో బీటీ రోడ్డు, రొంపేడులో చెక్‌పోస్టు, కోటిలింగాలలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుండి బయలుదేరి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యే సభలో పాల్గొనేందుకు మంత్రి బయలుదేరతారు.
మంత్రి తుమ్మల...
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఖమ్మం విద్యానగర్ కాలనీ, 10వ డివిజన్‌లోని చైతన్యనగర్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఆతర్వాత కోదాడ, తుంగతుర్తిలో జరిగే కార్యక్రమాలకు బయలుదేరతారు.
ఏప్రిల్ 20 నుంచి
ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేనెల 20నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. పది, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 20నుంచి 26వ తేదీ వరకు ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30గంటల నుంచి 5–30గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. అలాగే, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు.
సాగునీరు
వృథా కాకుండా పర్యవేక్షణ
ముదిగొండ: ఎక్కడ కూడా సాగునీరు వృథా కాకుండా పర్యవేక్షిస్తూ పంటలకు అందేలా చూడాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. ముదిగొండ మండలం కమలాపురంలో శనివారం పర్యటించిన ఆమె పంట కాల్వ, చెరువు, పంటలను పరిశీలించాక గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. రబీలో ఏయే పంటలు సాగు చేశా రు. సాగునీటి సరఫరా ఎలా జరుగుతోందని ఆరా తీసి మాట్లాడారు. చెరువులో నీటి మట్టం తక్కువగా ఉన్నందున సాగర్ నీటితో నింపాలని కోరగా, సమన్వయంతో పనిచేస్తూ సాగునీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆమె అధికారులకు ఊచించారు. తొలుత అంకమ్మ దేవాలయంలో అదనపు కలెక్టర్ పూజలు చేశారు. ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి, ఎంపీఓ వాల్మికీ కిషోర్, నాయబ్ తహసీల్దార్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బి.లక్ష్మి, మాజీ ఎంపీటీసీ వల్లూరి భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారికి అభిషేకం,
పల్లకీసేవ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం శ్రీవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశాక, స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. ఆతర్వాత పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. కాగా, పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో పెద్దసంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలతో కలిసి వచ్చి పూజలు చేశారు.ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్తంభాలకు ‘యూనిక్’ నంబర్లు
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత సమస్యలను ప్రాంతం ఆధారంగా త్వరగా గుర్తించేలా 33 కేవీ, 11 కేవీ స్తంభాలకు యూనిక్ పోల్ నంబర్ వేయిస్తున్నామని ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటి వరకు 33 కేవీ విభాగంలో 55 ఫీడర్లు, 11 కేవీ పరిధిలో 159 ఫీడర్లలో ఈ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన