
జీలకర్ర, బెల్లం భక్తులకు చూపుతున్న అర్చకులు
భద్రాచలం: భద్రగిరి భక్తజన సందోహంతో నిండిపోయింది. అంగరంగ వైభవంగా సాగిన శ్రీ సీతా రాముల వారి కల్యాణాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. భద్రాచలంలోని మిథిలా స్డేడియంలో బుధవా రం భక్తుల జయజయ ధ్వానా లు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతా రాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అంతరాలయంలో స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్న భక్తులు.. ఆ తర్వాత ఆరాధ్య దైవమైన శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణాన్ని కనులారా చూ సేందుకు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 9:45 గంటలకు ప్రధాన ఆలయం నుంచి సీతారాములతో పాటు లక్ష్మణు డు పల్లకీలో స్టేడియానికి బయలుదేరగా.. భక్తుల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ మాడ వీధుల గుండా మిథిలా స్టేడియానికి చేరుకున్నారు.
●ఆకట్టుకున్న కన్యావరణ..
ఈ వేడుకను ఉదయం 11:12 గంటల నుంచి 11:16 గంటల వరకు నిర్వహించారు. ఇందులోనే ప్రవరలు, యోక్త్రాబంధనం, యజ్ఞోపవీత ధారణ నిర్వహిస్తారు. ముందుగా సీతమ్మ వారికి తగు వరుడి కోసం ఎనిమిది మంది శ్రీవైష్ణవ పండితులు ఎనిమిది దిక్కుల్లో ప్రవరలు చెబుతూ అన్వేషణ సాగిస్తారు. చివరకు శ్రీరాముడిని వరుడిగా ఎన్నుకుంటారు. అనంతరం 11:19 గంటలకు గోత్రపూజ, కంకణ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఎనిమిది దర్భలతో కూడిన తాడును సీతమ్మ నడుముకు ధరింప చేస్తూ యోక్త్రాబంధన కార్యక్రమాన్ని ఉదయం 11:22 గంటలకు నిర్వహించి.. ఆ వెంటనే 11.26 గంటలకు బ్రహ్మచారిగా ఉన్న శ్రీరాముడు గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడనేందుకు గుర్తుగా యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు.
●వరపూజ..
శ్రీ వైష్ణవ పండితులు తమను తాము కన్యాదాతాలుగా భావిస్తూ శ్రీరాముడి పాద ప్రక్షాళన చేయడంతో వరపూజ ప్రారంభమైంది. అనంతరం సీతారామ, లక్ష్మణులను రామదాసు చేయించిన ఆభరణాలతో అలంకరించారు. పచ్చల పతకంతో శ్రీరాముడిని, చింతాకు పతకంతో సీతమ్మను, రామమాడ(ఒకవైపు రాముడి పట్టాభిషేకం, మరోవైపు ఆంజనేయుడు ముద్రలు ఉన్న బిళ్ల)ను లక్ష్మణుడికి ధరింపజేశారు. అనంతరం మధుపర్కం నివేదన చేశారు. ఈ కార్యక్రమం ఉదయం 11:30 గంటల నుంచి 11:37 గంటల వరకు కొనసాగింది. అనంతరం వధూవరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ శాంతికుమారి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత త్రిదండి చిన్న జీయర్ మఠం, శృంగేరి పీఠంతో పాటు శ్రీరంగం, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఇతర ప్రముఖులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆపై ఉదయం 11:42 గంటలకు మహా సంకల్ప పఠనం చేశారు.
●అభిజిత్ లగ్నం..
మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నం రాగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని భక్తులందరికీ చూపించి వధూవరులైన సీతమ్మ, శ్రీ రాముడి తలపై ఉంచారు. ఈ అపురూప క్షణాలను భక్తులందరూ కనులారా చూసి తరించారు.
●మాంగళ్యపూజ..
మధ్యాహ్నం 12:10 గంటల సమయంలో మాంగళ్య పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణ మంగళ సూత్రంలో రెండు బొట్లు ఉండగా సీతమ్మ మెడలో శ్రీరాముడు కట్టే మంగళ సూత్రానికి మూడు బొట్లు ఉండటం విశేషం. ఒకటి పుట్టింటి వారిది, రెండోది మెట్టింటి వారిది కాగా మూడోది భక్తుల తరుపున శ్రీరామదాసు చేయించినది. సరిగ్గా మధ్యాహ్నం 12:13 గంటలకు మాంగళ్యధారణ వేడుక నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరంగంనాథుడు, గోదాదేవి కల్యాణం, బంతులాటకు సంబంధించి ప్రబంధాలు పఠించారు.
●తలంబ్రాల వేడుక..
తేనె, గులాల్‌తో పాటు పంచద్రవ్యాలు కలిపిన ముత్యాల తలంబ్రాలను మధ్యాహ్నం 12:23 గంగంటలకు వధూవరులపై పోశారు. ఈ కార్యక్రమం చూసేందుకు పోటీ పడిన భక్తులు, ఆ తలంబ్రాలు దక్కించుకునేందుకు ఉత్సాహం చూపారు. చివరగా మధ్యాహ్నం 12:39 గంటలకు మంగళహారతి ఇవ్వడంతో సీతారాముల కల్యాణ వేడుక ముగిసింది. అనంతరం పల్లకీలో నూతన వధూవరులను ఆలయంలోకి తీసుకెళ్లారు.
కల్యాణ ఘట్టం సాగిందిలా..
ఉదయం 10:31 గంటల నుంచి 10:45 గంటల వరకు విశ్వక్సేన పూజ నిర్వహించారు. శ్రీరాముడి సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని గ్రహాధిపతిగా కూడా పేర్కొంటారు. జరగబోయే కల్యాణానికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఈ పూజ నిర్వహించారు. 10:48 గంటల నుంచి 10:56 గంటల వరకు పుణ్యావాచనం నిర్వహించారు. కల్యాణ మండపంలో కలశాన్ని ఏర్పాటు చేసి మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ కలశంలోకి పుండరీకాక్షుడిని, సుదర్శనుడుని ఆవాహన చేశారు. ఆ తర్వాత ఈ పుణ్యజలంతో మండలంలో ఉన్న వస్తువులను, పండితులతో పాటు కల్యాణ వేడుకలు చూస్తున్న భక్తులపై చల్లారు. ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అందరికీ మంచి జరగడంతో పాటు కల్యాణ వేడుకలు దినదినప్రవర్థమానం అవుతాయని పండితులు తెలిపారు. ఉదయం 10:59 గంటల నుంచి 11:11 గంటల వరకు సుయోద్వాహం నిర్వహించి మిథిలా స్టేడియానికి చేరుకున్న సీతమ్మ వారిని మంత్రపూర్వకంగా కల్యాణ మండపంలోకి తీసుకొచ్చారు.

శ్రీ సీతారాముల వారి కల్యాణానికి హాజరైన భక్తులు

సీతారాములపై తలంబ్రాలు పోస్తున్న అర్చక స్వాములు

స్వామి వారి పచ్చలహారాన్ని చూపిస్తున్న అర్చకులు

సీతమ్మ వారి మెడలో మాంగల్యాన్ని వేస్తూ...


కల్యాణానికి వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి కొండా సురేఖ

స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు