
వివరాలు సేకరిస్తున్న ఏఎస్‌ఐ కోడెత్రాచు
నేలకొండపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నాచేపల్లి గ్రామానికి చెందిన చట్టు నాగరాజు (32) మృతదేహం గురువారం వ్యవసాయ బావిలో కనిపించింది. గ్రామానికి చెందిన నాగరాజు, అతని స్నేహితుడు పి.గోపి బుధవారం మద్యం సేవించేందుకు వ్యవసాయ బావి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. తరువాతి రోజు నుంచి నాగరాజు కనిపించలేదు. ఆరోజు ఏం జరిగిందనే విషయం కూడా గోపి ఎవరికీ చెప్పలేదు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. బంధువులు, స్నేహితులను వాకబు చేశారు. కానీ ఆచూకీ లభించలేదు. శుక్రవారం స్థానిక వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు గోపిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.