
బాలసాని లక్ష్మీనారాయణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ అలక బూనారు. భద్రాచలం నియోజకవర్గ ప్రచార సమన్వయ బాధ్యతల నుంచి ఆయనను తప్పించడంతో కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ బాధ్యతలు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధుకు అప్పగించారు. బాలసాని అనుచురుడిని కాదని తెల్లం వెంకట్రావుకు భద్రాచలం పార్టీ టికెట్ కేటాయించడం కూడా ఆయన పార్టీకి దూరంగా ఉండడానికి మరో కారణంగా తెలుస్తోంది.
ఆశించి భంగపడి..
ఎమ్మెల్సీగా బాలసాని పదవీకాలం పూర్తయ్యాక మళ్లీ అదే పదవి వస్తుందని ఆశించారు. అయితే, ఆ పదవి తాత మధుకు అప్పగించగా ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇస్తారని ప్రచారం జరిగింది. చివరకు అది కూడా మధుకే దక్కగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఏదైనా వస్తుందని భావించినా నెరవేరలేదు. ఇక భద్రాచలం నియోజకవర్గానికి చెందిన తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చి నియోజకవర్గ ప్రచార సమన్వయ బాధ్యతలు బాలసానికి అప్పగించారు. కానీ ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో జరిగిన రాజకీయ పరిణామాలతో సమన్వయ బాధ్యతల నుంచి ఆయనను తప్పించి తాత మధుకు కట్టబెట్టారు. దీనికి తోడు భద్రాచలంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత బోదబోయిన బుచ్చయ్య బాలసాని అనుచరుడిగా కొనసాగుతుండగా, ఆయనకు టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దల ముందు ప్రతిపాదించారు. అయితే, అది కూడా దక్కకపోవడంతో బాలసానితో పాటు ఆయన అనుచర వర్గం పార్టీ పెద్దలపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడం లేదన్న కారణంతో బాలసాని భద్రాచలం నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదు.
బుజ్జగించినా..
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బాలసానిని.. మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుజ్జగించారు. మంత్రి హరీశ్‌రావుతో కూడా మాట్లాడించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని ఆయన అన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో బాలసాని బీఆర్‌ఎస్‌లో కొనసాగుతారా.. ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అని అనుచరవర్గం ఎదురుచూస్తోంది. గుర్తింపు లేని చోట ఉండకూడదని అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ నేతల నుంచి ఆహ్వానం అందినట్లు ప్రచారం సాగుతోంది.