ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై రెండో విడత చేపట్టిన విచారణ శుక్రవారంముగిసింది. కొందరు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి రూ.కోట్లలో మార్ట్‌గేజ్ రుణాలు పొందిన వ్యవహారం కొన్నేళ్ల క్రితం బయటపడింది. ఖమ్మంలోని ఎన్‌ఎస్‌టీ, ప్రధాన కార్యాలయం బ్రాంచి, రోటరీనగర్ బ్రాంచ్‌ల్లో మొత్తం 20 మంది వ్యక్తులు నకిలీ ధృవపత్రాల(ఇళ్ల స్థలాలు) ఆధారంగా రూ.4.50 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు తేలగా విచారణ చేయించారు. ధృవపత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అయినా ఎవరిపై చర్యలు తీసుకోకపోగా, రాష్ట్ర ఫైనాన్స్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్‌ను వినియోగించి టస్కాబ్ డీజీ ఎం బందెల అంజయ్య, ఏజీఎం రాఘవతో కూడిన అధికారుల బృందాన్ని విచారణకు నియమించారు. దీంతో రుణాలు పొందిన వారే కాక జమానతు ఉన్నవారు, సాక్షులు 73 మందికి నోటీసులు జారీచేసి మార్చి 13, 14, 15వ తేదీల్లో విచారణ నిర్వహించినా పలువురు హాజరుకాలేదు. ఈమేరకు గతనెల 29 నుంచి శుక్రవారం వరకు మరో దఫా విచారణ చేపట్టారు. అయితే ఈసారి కూడా 30మందికి పైగా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుని విచారణకు హాజరుకాలేదని సమాచారం. దీంతో విచారణ నివేదికను టస్కాబ్ అధికారులు, రాష్ట్ర సహకార రిజిస్ట్రార్‌కు అందించనుండగా అక్రమార్కులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.