మైసూరు జిల్లాలో గాలీవానకు దెబ్బతిన్న అరటి తోట
చిక్కమగళూరులో వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్తున్న యువతులు
మైసూరు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి, శనివారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కొంత ఆస్తినష్టం జరిగింది. శనివారం మధ్యాహ్నం 4.15 గంటలకు పిడుగుపడి మహిళతో పాటు రెండు మూగజీవాలు చనిపోయాయి. మైసూరు జిల్లా పిరియాపట్టణ తాలూకా సత్యగాల గ్రామానికి చెందిన చంద్రప్పచార్ పొలంలో పిడుగుపడడంతో రెండు పశువులు చనిపోయాయి. అలాగే పొలంలో పశువులు కాస్తున్న చంద్రప్పచార్ కోడలు వినోద కూడా ప్రాణాలు విడిచింది. మైసూరు సిటీలో ఈదురు గాలులు, భీకర ఉరుములతో వర్షం బీభత్సాన్ని కలిగించింది. పెద్దసంఖ్యలో చెట్లు, హోర్డింగులు నేలకొరిగాయి. జేపీ నగరలో కారుపై చెట్టు పడింది. అలాగే పోలీసు లేఔట్‌లో కూడా కారుపై కూలింది. సిద్ధార్థనగర, లలితాద్రిపురలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు చిక్కమగళూరులో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోరువాన కురిసింది.
పలు జిల్లాలకు వర్షసూచన
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, ఉత్తర జిల్లాల్లో 16 నుంచి 19 వరకూ భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు జాగ్రత్త వహించాలని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీర్షాలతో పాటు వడగళ్లు, పిడుగులు, ఈదురు గాలులు ఉండవచ్చు.
పిడుగులు, గాలులతో వర్షం
మహిళ దుర్మరణం
కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు


