దొడ్డబళ్లాపురం: బాగల్‌కోటె ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వీరణ్ణ చరంతిమఠకు వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌యూఐ నాయకులు దుష్ప్రచారం చేస్తూ కరపత్రాలు పంపిణీ చేయగా, బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఈసీ.. ఇద్దరు పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని గుర్తించింది. దీంతో ఈసీ సిఫార్సు మేరకు.. బాగల్‌కోట మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ విజయ, మురగుండి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ అశోక్ చవాన్‌ను బదిలీ చేశారు.
ఐటీ నిపుణుని కారులో గంజాయి
అన్నానగర్: చైన్నెలోని కోయంబేడు ప్రాంతంలో ఎన్నికల అధికారులు జరిపిన సోదాల్లో, బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి కారులో గంజాయి దొరికింది. వివరాలు.. చైన్నె లోని విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కోయంబేడు మార్కెట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక ఫుడ్ స్టాల్ ముందు ఓ కారును నిలిపి తనిఖీ చేశారు. ఒక ప్లాస్టిక్ సంచిలో దాచి ఉంచిన 80 గ్రాముల గంజాయిని గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తిని బెంగళూరు ఆనేకల్‌కు చెందిన ప్రిన్స్ జాకబ్ (36)గా గుర్తించారు. అతడు బెంగళూరులోని ఒక కంపెనీలో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. గంజాయి దొరకడంతో అతనిని అరెస్టు చేశారు.
రాములవారికి విశేష పూజలు
మండ్య: మండ్య జిల్లాలోని హలగూరులో శ్రీరామ మందిరంలో రామ నవమి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం భక్తులకు వాబే గౌడ కుటుంబం ప్రసాదాన్ని పంపిణీ చేసింది. ఉదయం నుంచే స్వామివారి మూలవిరాట్టుకు జలాభిషేకం, పంచామృత అభిషేకం తదితరాలను నిర్వహించారు. పుష్పాలతో అలంకరించి మంగళారతి ఇచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
33 ఏళ్లుగా చిక్కడు, దొరకడు..
ఎట్టకేలకు అరెస్టు
శివమొగ్గ: గత 33 ఏళ్లుగా కోర్టు విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్న బెంగళూరు నివాసిని శివమొగ్గలోని కోటే పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఇట్టుమడు ప్రాంతానికి చెందిన చంద్రు విఘ్నేష్ (62) నిందితుడు. కోటే ఠాణాలో ఇతనిపై గొడవ, దాడి కేసులు నమోదై ఉన్నాయి. కానీ 33 ఏళ్లుగా కోర్టు విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. శివమొగ్గ సీజేఎం కోర్టు నిందితునిపై గతంలోనే వారంటును జారీ చేసింది. చిక్కకుండా పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాడు. సీఐ హరీష్ పటేల్, ఎస్‌ఐ సంతోష్ భగోజీ తదితరులు గాలించి నిందితున్ని అరెస్టు చేసి కారాగారానికి తరలించారు.
జనగణనకు గైర్హాజరు కావద్దు
● కేంద్ర పాలికె కమిషనర్
బనశంకరి: జాతీయ జనాభా లెక్కల గణనకు అధికారులందరూ అంకిత భావంతో పనిచేయాలని, ఎవరైనా గైర్హాజరైతే కఠినచర్యలు తీసుకుంటామని బెంగళూరు కేంద్ర నగర పాలికె కమిషనర్ రాజేంద్ర చోళన్ తెలిపారు. ఆదివారం పీయుబీ భవనంలో జనగణన గురించి సమావేశం నిర్వహించారు. ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా జవాబుదారీతనంతో నిర్వర్తించాలన్నారు. నగరంలోని 6 నియోజకవర్గాల్లో జనగణనపై ఉద్యోగులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం నుంచి 2 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ఇందులో ఉద్యోగులందరూ పాల్గొనాలన్నారు. నగరంలో ఇళ్ల జాబితా, వసతి గణన ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు జరుగుతుందన్నారు. జనాభా లెక్కల సేకరణ విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.


