దొడ్డబళ్లాపురం: అగ్ని ప్రమాదంలో కొట్టాలు కాలిబూడిదైన సంఘటన కనకపుర తాలూకా రాయసంద్ర గేట్ వద్ద చెరువు కట్టపై జరిగింది. పాపమ్మ, ముత్తమ్మ అనే ఇద్దరు మహిళలకు చెందిన రెండు గుడిసెలకు ఆదివారంనాడు హఠాత్తుగా నిప్పంటుకుంది. క్షణాల్లోనే కాలి బూడిదయ్యాయి. బట్టలు, తిండిగింజలు, వస్తు సామగ్రి కాలిపోవడంతో మహిళలు విలపించారు. ఆకతాయిలు ఎవరైనా నిప్పంటించి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగలేదని విద్యుత్ అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నేత్రపర్వంగా కరగ
మాలూరు: తాలూకాలోని లక్కూరు ఫిర్కా పుర గ్రామంలో ఆదివారం శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపతాంబ దేవి 16వ సంవత్సరం కరగ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అలంకరించిన పూల కరగను తలపైకెత్తుకున్న పూజారి హరీష్ గ్రామంలోని ప్రధాన వీధులలో నృత్యాలు చేస్తూ తిరిగారు. భక్తులు తమ ఇళ్ల ముందు కరగను పూజించారు. దేవాలయం వద్ద వేదికపై కరగ నృత్యం భక్తులను ఎంతో ఆకట్టుకుంది. అగ్ని గుండ ప్రవేశంతో కరగ ఉత్సవం ముగిసింది.
శ్రీసీతా రాముల శయనోత్సవం
పావగడ: పావగడలో ప్రసిద్ధ శనీశ్వర ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఆదివారం సాయంత్రం సీతా రాముల ఉయ్యాలోత్సవం నేత్రపర్వంగా సాగింది. సీతా రాముల విగ్రహాలను ఉయ్యాలలో ఉంచి శయనోత్సవం సాగించారు. 10 రోజులుగా పలు దేవతా కార్యక్రమాలలో పాల్గొని అలసి పోయిన సీతారాములకు విశ్రాంతి కోసం శయనోత్సవం నిర్వహించారు. ఉదయమే సీతారాముల పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు శనీశ్వర స్వామిని, సీతారాములను దర్శించుకున్నారు.


