మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో భక్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన మునేశ్వర స్వామి దేవాలయంలో 48వ రోజు మండల పూజా కార్యక్రమాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. తొలుత మూల విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం, వేదమంత్ర పారాయణం, కలశ స్థాపన, తదితర పూజలు చేపట్టారు. అంతకుముందు స్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం 2 వేల మందికి పైగా భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. తాలూకాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి పూజల్లో పాల్గొన్నారు.
కొండపై పేలుళ్లను
ప్రశ్నించినందుకు దాడి
మాలూరు: కొండపై పేలుళ్లు జరుపుతుండడాన్ని ప్రశ్నించినందుకు ఇద్దరిపై దాడి చేసిన ఘటన తాలూకాలోని టీకల్ ఫిర్కా వీరకపుత్ర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు సురేష్, వెంకటేశప్ప కలసి అక్రమంగా కొండపై బ్లాస్టింగ్ చేపట్టారు. బ్లాస్టింగ్ చేసే ముందు గ్రామస్తులకు చెప్పాలి కదా అని వీరకపుత్ర గ్రామానికి చెందిన సురేష్, శ్రీనాథ్ ప్రశ్నించారు. ఆగ్రహించిన గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు సురేష్, వెంకటేశప్ప తదితరులు వీరకపుత్ర గ్రామానికి చెందిన సురేష్, శ్రీనాథ్‌పై దాడి చేశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మాలూరు పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసుకున్నారు.
ప్రశాంతంగా డైరెక్టర్ల ఎన్నిక
బొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకా మాయసంద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 12 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఎం.రామకృష్ణ 422, కెంపన్న 412, ఎ.మూర్తి 412, మల్లేష్ రెడ్డి 394, శ్రీరామ 366, గెరటిగనబేలె నంజుండప్ప 364, ఆర్.గోపాలప్ప 312, హెచ్.ఎల్.రఘు 303, సి.చిన్నప్ప 375, సేవంతమ్మ 317, శశికళా 382, నవ్య 100 ఓట్లు సాధించి డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. హాప్‌కామ్స్ డైరెక్టర్ మేఘా, టీఏపీసీఎంఎస్ డైరెక్టర్ తిలక్ కుమార్ పాల్గొన్నారు.


