కోలారు: తాలూకాలోని బెళగానళ్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడిగా బీఎం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా భాగ్యమ్మ గోపాలప్ప ఎన్నికయ్యారు. సంఘం రాబోయే 5 సంవత్సరాల అవధికి ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన శ్రీనివాస్ 9 ఓట్లతో ప్రత్యర్థి బీ.ఎన్. ప్రవీణ్ కుమార్‌పై విజయం సాధించారు. ప్రవీణ్ కుమార్‌కు కేవలం 3 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష స్థానానికి భాగ్యమ్మ గోపాలప్ప ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. డైరెక్టర్ బీ.కే. మురళీధర, బీ.టీ.నాగరాజ్, బీ.కే. నాగేష్, బీ.ఎన్.రాజణ్ణ, శాంతమ్మ తదితరులు నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు.
వైభవంగా కరగ ఉత్సవం
కోలారు: ముళబాగిలు తాలూకా మరవేమన గ్రామంలో శనివారం రాత్రి ద్రౌపదమ్మ దేవి కరగ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత దేవాలయంలో గంధోత్సవం, గణపతి పూజ, కల్యాణోత్సవం, హసికరగ, అభిషేకం, హోమం, మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. కరగ ప్రతి ఇంటి ముందుకు వెళ్లిన సమయంలో ప్రజలు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ద్రౌపదమ్మ దేవి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైన కరగ పూజారి చేసిన కరగ నృత్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అగ్నిగుండ ప్రవేశంతో కరగ ఉత్సవం ముగిసింది.


