మైసూరులో వైద్యుని డిజిటల్ అరెస్టు
మైసూరు: ప్యాలెస్ సిటీ మైసూరులో తరచూ సైబర్ నేరగాళ్ల చేతిలో జనం మోసపోతూనే ఉన్నారు. తాజాగా ముంబై పోలీస్ అధికారి పేరుతో ఒక మోసగాడు మైసూరులోని ఒక వైద్యున్ని డిజిటల్ అరెస్టు చేసి రూ.82.10 లక్షలు వసూలు చేశాడు. మైసూరు విజయనగర నివాసి అయిన రాజీవ్ బాధితుడు.
ఎలా జరిగిందంటే..
వివరాలు.. రాజీవ్‌కు కాల్ చేసిన వ్యక్తి తాను టెలికాం సంస్థ అధికారినని, మీ పేరుతో ఉన్న సిమ్ ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయని, మనీలాండరింగ్ కోసం ఉపయోగించారని, అశ్లీల వీడియోలు రవాణా చేశారని పలు ఆరోపణలు చేశాడు. మీ ఖాతా నుంచి అక్రమంగా రూ. 2 కోట్లు బదిలీ చేయబడ్డాయి అని బెదిరించాడు. తరువాత మరో వ్యక్తి వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి తాను ముంబై బాంద్రా ఠాణా పోలీసు అధికారినని చెప్పాడు. మోసగాడు, మిగతావారు పోలీసు దుస్తుల్లో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో మిమ్మల్ని, మీ భార్యను అరెస్టు చేస్తామని భయపెట్టారు. మీ ఆస్తుల వివరాలను చెప్పాలని, బ్యాంక్ ఖాతాల వివరాలను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అలా వైద్యుని నుంచి రూ 82.10 లక్షలు బదిలీ చేయించుకుని ఫోన్లు స్విచాఫ్ చేశారు. బాధితుడు సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
అక్రమాలకు పాల్పడ్డారంటూ
రూ.82 లక్షల వసూలు


