ఆ ఆలయంలో పెళ్లిళ్లు బంద్
● కారణాలపై సర్కారుకు నివేదిక
యశవంతపుర: బెంగళూరులోని చారిత్రక హలసూరు సోమేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి వేడుకలతో కోలాహలంగా ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఇక్కడ కళ్యాణ వీణ మోగడం లేదు. ఈ విషయమై ఆలయ పాలక మండలి కారణాలతో ప్రభుత్వానికి ఒక నివేదికను ఇచ్చింది. దేవస్థానంపై కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల పెళ్లిళ్లకు అనుమతి ఇవ్వడం లేదని నివేదికలో పేర్కొన్నారు.
8 ఏళ్లుగా ఇంతే
సోమేశ్వరస్వామి దేవస్థానంలో 8 ఏళ్ల నుంచి వివాహాలు చేయనివ్వడం లేదు. ఇక్కడ మూడుముళ్లు వేసుకున్న కొందరు దంపతులు కొంతకాలానికే గొడవలు పడి విడాకులు కావాలంటూ కోర్టుల్లో కేసులు వేసినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని కేసుల్లో విచారణ కోసం ఆలయ సిబ్బందిని కూడా కోర్టుకు పిలిపించారు. పెళ్లి చేసిన పాపానికి తమను కోర్టుకు లాగడంతో అర్చకులు, సిబ్బంది పెళ్లిళ్లు చేయటం మానేశారు. గుడిపై వస్తున్న అపప్రచారాన్ని తప్పించడానికి కూడా వివాహాలను ఇక్కడ బంద్ చేసినట్లు నివేదికలో తెలిపారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
నకిలీ నెయ్యి.. దంపతులకు కటకటాలు
● తమిళనాడులో తయారీ యూనిట్
● కర్ణాటకకు సరఫరా
బనశంకరి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నందిని బ్రాండ్ నకిలీ నెయ్యి తయారీ కేసులో సూత్రధారులైన దంపతులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. మైసూరుకు చెందిన శివకుమార్, భార్య రమ్యను అరెస్టు చేశారు. వీరు తమిళనాడులో నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని నెలకొల్పి అక్కడి నుంచి బెంగళూరుతో సహా కర్ణాటకలోని జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఆ ఫ్యాక్టరీలో కల్తీ నెయ్యి తయారీకి హైటెక్ యంత్రాలను ఉపయోగించేవారు. అక్కడే బాటిళ్లు, ప్యాకెట్లపై నందిని లేబుళ్లను ముద్రించి పకడ్బందీగా రూపొందించేవారు.
రూ.60 లక్షలు సీజ్
ఈ నెల 14 తేదీన చామరాజపేటేలోని గోదాముపై దాడిచేసిన పోలీసులు 8,136 లీటర్ల నకిలీ నెయ్యి ని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ముఠా లో డిస్ట్రిబ్యూటర్ మహేంద్ర, అతడి కుమారుడు దీపక్, మునిరాజు తో పాటు నలుగురిని అరెస్ట్‌చేశారు. వారిని విచారించగా శివకుమార్, రమ్య గురించి వివరించారు. దంపతుల బ్యాంకు ఖాతాల్లోని రూ.60 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. నకిలీ నెయ్యి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ దంపతులపై గతంలో మైసూరులోనూ నకిలీ ఉత్పత్తులు తయారీ కేసు నమోదైంది.
ఆ ఆలయంలో పెళ్లిళ్లు బంద్


