అసమానతలకు చోటులేని రాజ్యాంగం
శివాజీనగర: దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యతిరేక మనువాదులతో జాగ్రత్తగా ఉండాలని సీఎం సిద్దరామయ్య అన్నారు. బుధవారం వనంతనగర డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ భవన్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి ముందు దేశంలో అలిఖిత మనుస్మృతి అమల్లో ఉండేది, అందులో మానవ, సమానత్వ వ్యతిరేక నియమాలు ఉండేవి, అంబేడ్కర్ రాజ్యాంగంలో వాటికి చోటు లేదు అని చెప్పారు. సమ సమాజ నిర్మాణం, అసమానత్వ నివారణ రాజ్యాంగం, అంబేడ్కర్ ఆశయాలన్నారు.
అందరూ భారతీయులు అనేది మన రాజ్యాంగ మూల మంత్రమన్నారు. మనదేశంలో ఉన్నన్ని కుల, మతాలు వేరే ఏ దేశంలో కూడా లేవు. అందుకే ఈ భూమికి ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఇచ్చారని చెప్పారు. కుల వ్యవస్థ, ప్రమాదాలు అంబేడ్కర్‌కు అర్థమైనందునే రిజర్వేషన్‌ను కల్పించారన్నారు. అణగారిన వర్గాల శూద్రులకు ఆర్థిక శక్తి వచ్చినప్పుడే కులం పోతుందని అంబేడ్కర్ చెప్పేవారని, ఇది అందరూ తెలుసుకోవాలని సూచించారు. అసమానతలు ఉన్న దేశంలో సమానత్వం సులభంగా రాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రమంతటా రాజ్యాంగ దినోత్సవ సంబరాలు జరిగాయి. బడి బాలలచే ర్యాలీలు సాగాయి.
సీఎం సిద్దరామయ్య
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
అసమానతలకు చోటులేని రాజ్యాంగం


