జయహో వృక్షమాత.. జోహార్లు
శివాజీనగర: పద్మశ్రీ పురస్కార గ్రహీత, శతాయుషి, పర్యావరణ ఉద్యమకారిణి, వృక్షమాత.. ఇలా అనేక బిరుదులు గడించిన సాలుమరద తిమ్మక్క (114) ఇక లేరు. పచ్చని చెట్లన్నీ విలపించేలా ఆమె శుక్రవారం బెంగళూరు జయనగరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య అనారోగ్యాలతో ఆమె బాధపడుతూ ఉన్నారు. ఇటీవల ఇంటిలో బాత్‌రూంలో జారిపడడంతో స్వల్పంగా గాయపడ్డారు. కొన్నివారాలుగా ఆస్పత్రిలో ఉన్నారు.
మొక్కలు, చెట్లే సర్వస్వం
సంతానం కలగలేదని ఆమె మొక్కలనే పిల్లలుగా భావించారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు, పాఠశాలలు ఇలా అంతటా మొక్కలు నాటి భావితరాల కోసం చెట్లను పెంచి పోషించారు. నిరక్షరాస్యులైనా కూడా పర్యవరణ పరిరక్షణలో ప్రముఖ పాత్రను పోషించడాన్ని చూసి ప్రపంచమే హర్షించింది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఆమెను అనేక అవార్డులు, సన్మానాలు వరించాయి. అమెరికాలో లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో విద్యాసంస్థలో తిమ్మక పేరుతో విభాగాలను ఏర్పాటు చేశారు. తిమ్మక్క తుమకూరు జిల్లా గుబ్బిలో జన్మించి, రామనగర వద్ద హులికల్లుకు చెందిన చిక్కయ్యను వివాహమాడి మెట్టినింటికి వచ్చారు. ఆ ఊరినే పచ్చని వనంగా మార్చారు.
లెక్కలేనన్ని గౌరవాలు
జాతీయ పౌర పురస్కారం, ఇందిరా ప్రియదర్శిని, వృక్షమిత్ర, వీరచక్ర, కర్ణాటక కల్పవల్లి అవార్డులు, పంపాపతి పర్యావరణ అవార్డు, బాబా సాహెబ్ అంబేద్కర్ అవార్డు, వనమాత అవార్డు, మాగడి సిటిజన్ పురస్కారం, శ్రీమాతా అవార్డు, కర్ణాటక పర్యావరణ అవార్డు, పద్మశ్రీ, గౌరవ డాక్టరేట్లు లభించాయి. ఆమెకు దక్కిన అవార్డులు, బిరుదులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. పిల్లలు లేరని బాధ లేదు, చెట్లే మా పిల్లలు అని ఆమె చెప్పేవారు.
సంతాపాల వెల్లువ
వృక్షమాత తిమ్మక్క మరణానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్, రాష్ట్ర, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయానికి సీఎం సిద్దు నివాళులు అర్పించారు. కర్ణాటకకు తిమ్మక్క గర్వకారణమని కొనియాడారు. ఆమె పెంపుడు కుమారుడు ఉమేశ్‌ను పరామర్శించారు. శనివారం అంతిమ సంస్కారాలు జరుగుతాయి.
ప్రేమ, గౌరవంతో జీవిద్దాం..
తిమ్మక్క చివరి సందేశం
రాష్ట్ర ప్రజలకు ఆఖరి క్షణంలో సాలుమరద తిమ్మక్క ఓ సందేశాన్ని అందించారు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఉన్నంత కాలం ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, హింసకు గురిచేయకుండా, పేద, ధనికులు, బిచ్చగాళ్లు, అసహాయులని అనకుండా అందరూ ఒక్కటే అనే విధంగా బతకాలి. అందరినీ గౌరవించాలి, ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి. దేశం బాగుంటే అందరూ బాగుంటారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ మొక్కలను నాటి చెట్లుగా పెంచాలి. గోవులను, చెరువులను పరిరక్షించాలి అని హితవు పలికారు.
పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క అస్తమయం
బెంగళూరు ఆస్పత్రిలో తుదిశ్వాస
చెట్ల సంరక్షణతో అంతర్జాతీయ ఖ్యాతి
జయహో వృక్షమాత.. జోహార్లు
జయహో వృక్షమాత.. జోహార్లు
జయహో వృక్షమాత.. జోహార్లు


