విద్యార్థులకు చట్టం పరిజ్ఞానం అవసరం
రాయచూరు రూరల్: విద్యార్థులకు చట్టం, న్యాయంపై అవగాహన అవసరమని రాయచూరు జిల్లా న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శశిధర్ శెట్టి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాయచూరు ఆదికవి మహర్షి విశ్వవిద్యాలయంలో రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార, మానవ హక్కుల అవినీతి వ్యతిరేక సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. శాంతిక మారు పేరు భారతదేశమని అన్నారు. అలాంటి దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. నేడు అవినీతి అధికమైందన్నారు. దాని నిర్మూలనకు కంకణ బద్ధులు కావాలన్నారు. న్యాయం, చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలనే సదాశయంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కోరారు. సమావేశంలో న్యాయమూర్తులు మారుతి బగాదే, రాయచూరు ఆదికవి మహర్షి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని, అధికారులు చెన్నప్ప, జ్యోతి, రాజాశంకర్, శివశంకర్, ప్రాణేష్ కులకర్ణి, న్యాయమూర్తులు స్వాతిక్, నలపాడ్, బాల సుబ్రమణ్యంలున్నారు.


