మహిళ నుంచి రూ.1.81 కోట్ల వసూలు
యశవంతపుర: మహిళను డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.81 కోట్లను దోచుకున్న ఘటన దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. అక్టోబర్ 24న స్థానిక మహిళ (58)కు మధ్యాహ్నం ఓ అపరిచిత వ్యక్తి కాల్ చేశాడు. ముంబై కొలాబా ఠాణా నుంచి పోలీసు అధికారిని మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీరు మనీలాండరింగ్, మనుషుల అక్రమ రవాణాకు పాల్పడి డబ్బులు తీసుకున్నట్లు బెదిరించాడు. విచారణ చేయాలని, వీడియో కాల్‌కు సహకరించాలని సూచించారు. దీనిని నమ్మిన మహిళ భయపడి వీడియో కాల్‌లో మాట్లాడింది. మహిళ నుంచి ఏ తప్పు చేయలేదని ఓ లెటర్ రాయించుకొని వాట్సాప్‌లో తీసుకున్నాడు. మరో నంబర్ నుంచి వినోద్ రాథోడ్, రాజీశ్ మిశ్రా అనే ఇద్దరు కాల్ చేసి తాము పోలీసులమని, విచారణ జరపాలని ఆమె బ్యాంక్ వివరాలు, ఖాతాలో ఉన్న మొత్తం డబ్బుల వివరాలను సేకరించారు. మరుసటి రోజున ఆమెకు మళ్లీ కాల్ చేసి, మీ ఖాతాల్లో ఉన్న డబ్బులను తమ ఖాతాలకు పంపాలని, తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ భయపెట్టారు. బాధిత మహిళ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు రూ.1.81 కోట్లను దుండగుల ఖాతాలకు బదిలీ చేసింది. తరువాత దుండగుల ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. మోసం తెలుసుకుని మంగళూరు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది.
మంగళూరులో డిజిటల్ అరెస్టు బాగోతం


