అడుగు స్థలం కోసం కుటుంబంపై హత్యాయత్నం
బాగేపల్లి (భాగ్యనగరం): ఇంటి పక్కన అడుగు జాగా కోసం రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరికి ఓ కుటుంబానికి ఆహారంలో విషం పెట్టి చంపే దాకా కక్షలు వచ్చాయి. గురువారం విషం కలిసిన సాంబారు తిని ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన బాగేపల్లి తాలూకాలోని పరగోడు పంచాయతి దేవిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. ముద్దారెడ్డి, భాగ్యమ్మ, మంజునాథ్, ఈశ్వరమ్మ, సుబ్రమణి, మణి, భాను చిక్కబళ్ళాపురంలోని ఓ ప్రైవేట్ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో మంజునాథ్, ముద్దారెడ్డి, సుబ్రమణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సాంబారు తిని పొలానికి..
ఉదయం 10 గంటలకు సాంబారుఅన్నం తిని పొలం పనికి వెళ్లారు. ఇంతలో కడుపునొప్పి, వాంతులతో సతమతమయ్యారు, గ్రామస్తులు వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. తాము వంట చేస్తుండగా స్థానిక యువకుడు చౌడారెడ్డి మంచినీళ్లు కావాలని వచ్చాడని ఆ ఇంటి మహిళలు తెలిపారు. అతడే సాంబారులో విషపదార్థం కలిపినట్లు చెప్పారు. దీంతో చౌడారెడ్డిని అరెస్టు చేశారు.
పాపిరెడ్డి పథకం
బాధితుల పక్కింటిలో ఉండే పాపిరెడ్డి చెప్పడంతోనే పురుగుల మందును కలిపానని నిందితుడు వెల్లడించాడు, దీంతో పాపిరెడ్డిని కూడా అరెస్టు చేశారు. ముద్దారెడ్డి, పాపిరెడ్డి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఒక అడుగు స్థలం గురించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ముద్దారెడ్డి కుటుంబాన్ని అంతమొందించాలని తీర్మానించుకుని ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. చిక్కబళ్లాపురం ఎస్పీ కుశాల్ చౌక్సీ, ఏఎస్పీ జగన్నాథ రై, డిఎస్పీ శివకుమార్‌లు ఆ ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
పొరుగింటి సాంబారులోకి విషం
8 మందికి అస్వస్థత
బాగేపల్లి వద్ద కిరాతకం
ఇద్దరు అరెస్టు
అడుగు స్థలం కోసం కుటుంబంపై హత్యాయత్నం
అడుగు స్థలం కోసం కుటుంబంపై హత్యాయత్నం
అడుగు స్థలం కోసం కుటుంబంపై హత్యాయత్నం


