పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
రాయచూరు రూరల్: రాయచూరుతో పాటు 8 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర భారీ ఉక్కు, గనుల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. ఆయన ఈ విషయంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో రాయచూరు, మండ్య, బీదర్, చామరాజ నగర్, కోలారు, హాసన, మంగళూరు, హుబ్లీ–ధార్వాడల్లో పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయం మేరకు ప్రాంతీయ స్థాయిలో పరిశ్రమల ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. రాయచూరులో వ్యవసాయ ఉత్పత్తుల సంస్కరణ కేంద్రాలు, మంగళూరు, హుబ్లీ–ధార్వాడల్లో సరుకుల రవాణాకు ప్రాధాన్యం కల్పించారన్నారు.


