చక్కెర కర్మాగార యజమానులతో సమావేశం
శివాజీనగర: పెండింగ్‌లో ఉన్న చెరకు రైతుల సమస్యను పరిష్కరించి, చెరకు పంటకు అధిక ధర నిర్ణయించి రైతుల డిమాండ్లు పరిష్కరించే దిశలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం రాష్ట్రంలో చక్కెర కర్మాగారాల యజమానులు, ఎంపీలు, రైతు నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. చెరకు రైతుల సమస్య గురించి విధానసౌధ సభామందిరంలో సీఎం ముందుగా అన్ని చక్కెర కర్మాగారాల యజమానులతో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి సీఎం వారితో సుమారు 2 గంటలకు పైగా చర్చలు జరిపారు.
రైతు సంఘం నాయకులతో చర్చలు
అనంతరం ముఖ్యమంత్రి చెరకు రైతుల సంఘం నాయకులతో సమావేశమయ్యారు. రైతులకు సహాయానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే చెరకు పంటకు ఎఫ్‌ఆర్‌పీ నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి లేఖ రాసింది. సమయావకాశం కల్పిస్తే శనివారమే ప్రధానిని కలిసి మీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళతామని రైతు నాయకులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. పోరాటం విరమించుకోవాలని చెరకు రైతులకు ముఖ్యమంత్రి సమావేశంలో విన్నవించారు.
తీవ్ర స్వరూపం దాల్చిన ధర్నా
ప్రతి టన్నుకు రూ.3500 ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ బెళగావి, బాగలకోటె, విజయపుర, గదగ్ జిల్లాల్లో పోరాటం రోజురోజుకు తీవ్ర స్వరూపం దాల్చుతోంది. బెళగావిలోని హత్తరిగిలో వందలాది మంది రైతులు హఠాత్తుగా బెంగళూరు–పుణె జాతీయ రహదారిని కొంతసేపు అడ్డుకొని ధర్నా నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిలో రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసుల విన్నపం మేరకు రహదారి బంద్‌ను విడిచి సర్వీస్ రోడ్డులో కూర్చొని పోరాటం కొనసాగించారు. సమావేశంలో డీసీఎం డీ.కే.శివకుమార్, మంత్రులు శివానంద పాటిల్, హెచ్.కే.పాటిల్, ఎం.బీ.పాటిల్, సతీశ్ జార్కిహోళి, ఆర్.బీ.తిమ్మాపుర, శరణ ప్రకాశ్ పాటిల్, ప్రియాంక ఖర్గే, లక్ష్మీ హెబ్బాళ్కర్, రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్, మాజీ మంత్రి మురుగేశ్ నిరాణి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీశ్ పాల్గొన్నారు.


