పులి దాడిలో మరో రైతు మృతి
మైసూరు : మైసూరు జిల్లాలో పులి దాడులకు మరో రైతు బలయ్యాడు. సరగూరు తాలూకా హెగ్దూడిలు గ్రామానికి చెందిన చౌడానాయక్(55) శుక్రవారం ఉదయం తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా పులి దాడి చేసి లాక్కెళ్లింది. పొలంలో ఉన్న ఎడ్లు బెదిరి ఇంటికి చేరాయి. చౌడానాయక్ రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా చెట్ల పొదల్లో మృతదేహం కనిపించింది. ఇతను ఏడాది క్రితం ఏనుగు దాడిలో గాయపడి చికిత్స పొంది కోలుకున్నాడు. ఇంతలోనే పులి దాడికి బలయ్యాడు. మృతుడికి భార్య రుక్మిణి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు అటవీశాఖ అధికారి పరమేశ్వర్, ఆర్‌ఎఫ్‌ఓ ఆమృత రాగా స్థానికులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే పులి దాడిలో ఇద్దరు మృతి చెందారని, అయినా పులిని కట్టడి చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకొని అటవీశాఖ అధికారులను తీసుకెళ్లిపోయారు.
ఒకే నెలలో ముగ్గురు రైతులు బలి
పులి దాడిలో నెల రోజుల్లోనే ముగ్గురు మృతి చెందారు. బెణ్ణగెరె గ్రామానికి చెందిన రాజశేఖర్, కుర్నెగాళ గ్రామానికి చెందిన దొడ్డనింగయ్యలు పులి దాడిలో మృతి చెందారు. ఆఘటన కళ్ల ముందు మెదులుతుండగానే తాజాగా చౌడానాయక్ పులి దాడిలో మృతి చెందాడు. అదేవిధంగా సరగూరు గ్రామానికి చెందిన మహదేవ(మాదేగౌడ) అనే రైతు పులి దాడిలో రెండు కళ్లు పోగొట్టుకున్నాడు.
ఆగ్రహంతో ఆర్‌ఎఫ్‌ఓపై దాడి చేసిన ప్రజలు
పులి దాడిలో మరో రైతు మృతి
పులి దాడిలో మరో రైతు మృతి


