రేపు బెంగళూరులో కోటి సంతకాల సేకరణ
మడకశిర: ఏపీ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతరాజు తెలిపారు. ఆయన శుక్రవారం మడకశిరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని నాగసంద్ర మెట్రో సమీపంలో ఉన్న దాసరహళ్లి మాజీ ఎమ్మెల్యే మంజునాథ్ కార్యాలయం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్, అడ్మిన్ హెడ్ ఆలూరు సాంబశివారెడ్డి, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప తదితర నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. బెంగళూరు నగరంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వివిధ జిల్లాలకు సంబంధించిన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రజలను లూటీ చేస్తున్న
కాంగ్రెస్ సర్కార్
● ఫ్రీడం పార్కులో జేడీఎస్ ధర్నా
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి సామాన్యుల జేబులను గుల్ల చేస్తోందని ఆరోపిస్తూ జేడీఎస్ నాయకులు శుక్రవారం నగరంలోని స్వాతంత్య్ర ఉద్యానవనంలో ధర్నా చేశారు. బెంగళూరు మహానగర జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.ఎం.రమేశ్‌గౌడ, విధానపరిషత్ సభ్యుడు టీ.ఏ.శరవణ, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు శైల సంతోజిరావు, పార్టీ నాయకులు తిమ్మేగౌడ, కే.వీ.నారాయణస్వామి, తులసీరామ్, నాగేశ్‌రావు, శ్యాముయెల్ మాట్లాడుతూ ప్రభుత్వం నిత్యావసరాలు, ఇంధన ధరలు పెంచి సామాన్య ప్రజల కడుపును కొట్టి వారి జేబుకి కత్తెరవేసిందని ఆరోపించారు. కొత్తగా బీ ఖాతా నుంచి ఏ ఖాతాలోకి మార్పులు చేస్తామని చెప్పి మళ్లీ ప్రజలను లూటీ దోపిడీకి చేస్తున్నారని మండిపడ్డారు.


