ఏనుగు దాడిలో మరో రైతు మృతి
కెలమంగలం: అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన వృద్ధుడిపై ఒంటి ఏనుగు దాడి చేసి చంపిన ఘటన డెంకణీకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. డెంకణీకోట సమీపంలోని తావరకెరె గ్రామానికి చెందిన రైతు క్రిష్ణప్ప (65) గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఓ గొర్రె అటవీ ప్రాంతం లోపలికి వెళ్లడంతో వెతుక్కుంటూ వెళ్లాడు. ఈ సమయంలో పొదలో దాగి ఉన్న ఒంటి ఏనుగు క్రిష్ణప్పపై దాడి చేసి దారుణంగా చంపేసింది. స్థానికులు డెంకణీకోట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రిష్ణప్ప మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఏనుగు దాడిలో రైతు మృతి చెందడంతో ఆవేశానికి గురైన స్థానిక ప్రజలు అటవీ శాఖాధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. అటవీ ప్రాంత గ్రామాల్లో ఏనుగుల దాడులను నివారించాలని డిమాండ్ చేస్తున్నా అధికార్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. పంటలు ధ్వంసం కావడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. డీఎస్పీ ఆనంద్‌రాజ్, పోలీసులు ఆందోళనకారులతో చర్చించారు.


