నీరు ఇవ్వకపోతే పోరాటం చేస్తాం
సాక్షి బళ్లారి: తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని రైతులకు రబీలో పంటలు సాగు చేసేందుకు డ్యామ్ నుంచి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తమ గౌడ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పత్రికా భవనంలో పలువురు రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర డ్యామ్ పరిధిలో గేట్లు మార్చడానికి మూడు నెలల సమయం చాలని నిపుణుడు కన్నయ్య నాయుడు సూచించారన్నారు. రబీ పంట అయిన తర్వాత గేట్ల మార్చవచ్చని తెలిపారు. అయితే గేట్లు మార్చే పనుల నేపథ్యంలో రబీ పంటకు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం సరికాదని పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన నీటి పారుదల సలహా సమితి (ఐసీసీ) సమావేశంలో సంబంధించిన మంత్రులు కూడా అప్పట్లో రబీకి నీరు ఇవ్వలేమని చెప్పలేదని.. మరొక సారి సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఆయకట్టు రైతుల్లో గందరగోళం సృష్టించేలా ప్రకటనలు వస్తుండటం విచారకరమన్నారు. గేట్లు మార్చడంలో కన్నయ్య నాయుడు సూచనలు పాటించి రబీలో రైతులకు నీరు వదలడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రబీ పంట తర్వాత గేట్లు మార్చే పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సాగు నీరు అందించాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో రెండవ పంటకు సాగు నీరు అందించాలని మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, మాజీ ఎంపీ విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రబీ పంటలకు నీరు అందించేందుకు డీసీఎం అంగీకరించక పోవడాన్ని తప్పుబట్టారు.
నీరు ఇవ్వకపోతే పోరాటం చేస్తాం


