గారపాటి సేవలు అమూల్యం
రాయచూరు రూరల్: అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షుడు, ప్రవాసాంధ్రుడు గారపాటి రామకృష్ణను శుక్రవారం గోవా, మహరాష్ట్ర తెలుగు సంఘాల ఆధ్వర్యంలో సత్కరించారు. గోవాలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర తెలుగు సంఘాల అధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడారు. గారపాటి రామకృష్ణ సమాజానికి చేసిన సేవలను గుర్తించి సన్మానించామన్నారు. ప్రవాసాంధ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని కొనియాడారు. ఉచిత అరోగ్య సేవలు, సాముహిక వివాహాలు, విద్యా రంగం, ధార్మిక కార్యక్రమాల్లో రామకృష్ణ చురుకుగా పాల్గొంటూ యువకులకు ఆదర్శంగా నిలిచారన్నారు. కర్ణాటక తెలుగు సంఘాల అద్యక్షుడు ఉమా మహేశ్వరరావు, దక్షిణ గోవా తెలుగు సంఘాల అధ్యక్షుడు బి.నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.


