కారు బోల్తా: 8 మందికి గాయాలు
సాక్షి బళ్లారి: దావణగెరె జిల్లా జగళూరు తాలూకా తాతన్‌హట్టి సమీపంలో శుక్రవారం ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వివరాలు..బెంగళూరు నుంచి గంగావతికి ఓ కుటుంబం కారులో బయలుదేరింది. జగళూరు తాలూకా తాతన్‌హట్టి సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పింది. ఈ ఘటనలో నూర్, షమీ హుల్లా, గురురాజ్, ఖాదర్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జగనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విధి నిర్వహణలో
అలసత్వం వద్దు
రాయచూరు రూరల్: జిల్లాలో పోలీసులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని బళ్లారి డివిజన్ ఐజీపీ వర్తిక కటియార్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో గబ్బూరు, దేవదదుర్గ, జాళహళ్లిలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నేరాల కట్టడికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను వాడరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్పీ పుట్ట మాదయ్య, అదనపు ఎస్పీలు హరీష్, కుమార స్వామి, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
ఈరమ్మకు రాష్ట్ర స్థాయి
కన్నడ రాజ్యోత్సవ అవార్డు
హొసపేటె: గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది గర్భిణులకు ప్రసవాలు చేసిన ఓబల్శెహట్టి హళ్లి గ్రామానికి చెందిన సూలగత్తి ఈరమ్మ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. శనివారం జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆమెకు రాష్ట్ర స్థాయి కన్నడ రాజ్యోత్సవ అవార్డు అందజేయనున్నారు. ఈరమ్మ అవార్డుకు ఎంపిక కావడంతో ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.టి శ్రీనివాస్ అభినందించారు.
కారు బోల్తా: 8 మందికి గాయాలు


