యోగ, ధ్యానంతో మానసిక ఆరోగ్య వృద్ధి
హుబ్లీ: యోగ, ధ్యానం సాధనతో మానసిక ఆరోగ్య వృద్ధి సాధ్యపడుతుందని ప్రధాన సీనియర్ సివిల్ న్యాయమూర్తి పరశురామ దొడ్డమణి తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో జిల్లా మానసిక ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినం, అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ యోగభ్యాసం, ధ్యానం, ఒత్తిడి లేని జీవనశైలి అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఎల్లప్పుడు సానుకూల ధృక్పథం అలవర్చుకోవాలన్నారు. దూర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబం, మిత్రులతో ఎక్కువ సమయం గడపటం ద్వారా సంతోషంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో డీహెచ్ సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రాయచూరు రూరల్: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. గురుమిఠకల్ తాలుకా వడవాటి శివ కుమార్ (30) నాలుగు ఎకరాల భూమిలో పత్తి సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నీటిలో మునిగిపోయింది. పత్తి సాగుకు రూ.6 లక్షలకు పైగా అప్పులు చేయడంతో మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గంలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరణ్ణ దోడ్డమని తెలిపారు.
పరిశోధనలపై
దృష్టి సారించాలి
హుబ్లీ: పారిశ్రామిక రంగంలో అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సిద్ధం చేయాల్సిన అవసరం చాలా ఉందని కర్ణాటక విశ్వవిద్యాలయం విజ్ఞాన విభాగం డీన్ ప్రొఫెసర్ అరవింద మూలిమని తెలిపారు. గురువారం కర్ణాటక విశ్వవిద్యాలయం ఖనిజ శాస్త్రం అధ్యయన విభాగం సహకారంతో ప్రధానమంత్రి శిక్ష అభియాన ద్వారా మూడు రోజుల జాతీయ స్థాయి అధ్యాపకుల పునచేతన శిబిరం, బాలకృష్ణన్ ఎండోమెంట్ కోర్సును ప్రారంభించారు. కువెంపు విశ్వవిద్యాలయం గణిత శాస్త్రం అధ్యయన విభాగం ముఖ్యులు ప్రొఫెసర్ బీజీ గిరిశ మాట్లాడుతూ.. గణిత శాస్త్రం విద్యార్థులు పరిశోధన మనోభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆ వర్సిటీ సిండెకేట్ సభ్యుడు రాబట్ గద్దాపురి మాట్లాడుతూ.. సమయానికి తగు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అధ్యాయనంలో నిరంతరం శ్రమించాలన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పత్తి మిల్లుకు నిప్పు
● రూ.లక్షల్లో ఆస్తి నష్టం
బళ్లారి టౌన్: నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియా రెండవ స్టేజ్‌లో వెంకటేష్‌కు చెందిన దీప్తి కాటన్ మిల్లుకు గురువారం ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుంది. రూ.లక్షల విలువైన పత్తి కాలిపోయింది. మధ్యాహ్నం సమయంలో పత్తిని అన్‌లోడ్ చేస్తుండగా విద్యుత్ సర్క్యూట్ వల్ల నిప్పు అంటుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక దళాలకు ఫోన్ చేయడంతో హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనపై స్థానిక ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కొత్త భవనంలో వికాస్ సౌహార్థ కో–ఆపరేటివ్ బ్యాంక్ సేవలు
హొసపేటె: హోస్పేట్ కేంద్రంగా పని చేస్తున్న వికాస్ సౌహార్థ కో–ఆపరేటివ్ బ్యాంక్ సర్దార్ పటేల్ మెయిన్ రోడ్డులోని నాలుగు అంతస్తుల భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఆ బ్యాంక్ అధ్యక్షుడు విశ్వనాథ్ హిరేమట్ తెలిపారు. నవంబర్ 1న ఉదయం 9:30 గంటలకు కొత్త భవనంలో సేవలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కొట్టూరు బసవలింగ మహాస్వామీజీ, కొప్పల్ గవి మఠానికి చెందిన అభినవ గవిసిద్దేశ్వర మహాస్వామిజీ, వి సాప్ట్‌కు చెందిన మూర్తి వీరగంటి, గోద్రేష్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పెర్సీ మాస్టర్ బహదూర్ హాజరవుతారన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ సలహాదారు విజే కులకర్ణి, సీనియర్ డైరెక్టర్లు ఛాయా దివాకర్, రమేష్ పురోహిత్, ఎం.వెంకప్ప, కే.వికాస్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న హిరేమట్ పాల్గొన్నారు.
యోగ, ధ్యానంతో మానసిక ఆరోగ్య వృద్ధి


