తుపాను ప్రభావం.. పంటలు నాశనం
సాక్షి బళ్లారి: ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో పాటు తుంగభద్ర డ్యాంకు ఎగువన భారీ వర్షాలు కురవడంతో డ్యాంలోకి జూన్ నెలాఖరు కల్లా తగినంత నీరు రావడంతో పాటు జూలైలోనే కాలువలకు నీటిని విడుదల చేయడంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు ఉత్సాహంగా పంటలను సాగు చేశారు. ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి, మొక్క జొన్న, జొన్న, కొర్రలు, సాములు తదితర పంటలను విస్తారంగా సాగు చేశారు. తమకు అనుకూలమైన పంటలను రైతులు సాగు చేసిన నేపథ్యంలో అష్టకష్టాలతో లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టి పంటలను కాపాడుకుంటూ వచ్చారు. మూడు నెలలుగా పంటలకు సోకిన తెగుళ్లను నివారిస్తూ కలుపు మొక్కలను తొలగించి చంటి బిడ్డల్లా పెంచి తీతా పంట చేతికి అందే సమయంలో గత 15 రోజుల నుంచి వివిధ రకాలుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు, తుఫాను ప్రభావం, చలి గాలులు వీస్తుండటంతో ఆయకట్టు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గోరుచుట్టుపై రోకటి పోటులా వర్షాలు
వరి గింజలు బాగా పట్టి మరో 15–20 రోజుల్లో కోతలు జరుగుతాయని ఆశిస్తున్న రైతాంగానికి గోరుచుట్టుపై రోకటి పోటులా వర్షాలు వెంటాడుతుండటంతో వరి నేల మీద వాలిపోతూ గింజలు నేల రాలుతున్నాయి. దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు చేతికి అందే సరికి వరుణుడు, వాతావరణ ప్రభావం పంటలపై పడుతుండటంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వరి రైతులే కాకుండా మిర్చి, మొక్క జొన్న రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. గత మూడేళ్లుగా మిర్చి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఈసారి ఒక వైపు తెగుళ్లు వెంటాడుతుండటం వల్ల మరో వైపు వాతావరణ ప్రభావం వల్ల కూడా మిర్చి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. రోజు మార్చి రోజు మందులు కొడుతున్నా మిర్చికి తెగుళ్లు పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొంతా తుఫాన్ ప్రభావం తగ్గినప్పటికీ ఈదురు గాలులు కొనసాగుతూ రోగాలు వెంటాడుతుండటంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేవుడిపైనే పంట రక్షణ భారం
పంట చేతికొచ్చే వేళ మొంథా
ప్రతాపంతో ఈదురు గాలులు, వర్షాలు
నేలవాలుతున్న పంటలతో రైతన్నల్లో ఆందోళన
తుంగభద్ర ఆయకట్టు పరిధిలో లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు ప్రతి రైతన్న పంట చేతికి అందుతుందో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆయకట్టు పరిధిలో రబీ పంట వేసుకోకూడదని ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను ఎలా దక్కించుకోవాలోనని దేవుడిపైనే భారం వేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో 33 గేట్లలో గత ఏడాది ఒక గేటు కొట్టుకొని పోయిన నేపథ్యంలో మిగిలిన అన్ని గేట్లను మరమ్మతులు, కొత్తగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రబీకి హాలిడే ప్రకటించి నాలుగు నెలల్లో తుంగభద్ర గేట్లన్నింటిని మార్చాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో దాదాపు రబీ పంట దాదాపు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను దక్కించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు రైతులు సాక్షితో మాట్లాడుతూ ఆయకట్టు పరిధిలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు వర్షం ప్రభావంతో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అంతేగాక రబీలో కూడా క్రాఫ్ హాలిడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయకట్టు రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
తుపాను ప్రభావం.. పంటలు నాశనం


