హొసపేటె: విజయనగర జిల్లా గ్రామీణ ప్రాంతంలో అక్రమ మద్యం అమ్మకాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ మధ్య నిషేధ ఆందోళన సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేత శైనాజ్ మాట్లాడుతూ ఇటీవల గ్రామీణ భాగంలో విచ్చలవిడిగా చిన్న చిన్న బంక్‌లు, పాన్ దుకాణాల్లో అక్రమంగా మద్యం బాటిల్స్‌ను అమ్ముతున్నారని తెలిపారు. అక్రమ మద్యం బాటిల్స్‌లను అమ్మడం ద్వారా గ్రామీణ భాగంలో యువత తాగుడుకు బానిసలుగా తయారయ్యారన్నారు. అదే విధంగా రోజు రోజుకు తాగుబోతుల సంఖ్య పెరుగుతోందన్నారు. వెంటనే గ్రామీణ భాగంలో అక్రమ మద్య వ్యాపారాన్ని అరికట్టాలన్నారు. సంఘం నేతలు మంజమ్మ, అక్కమహాదేవి, రేఖ, నారాయణ, నింగమ్మ, సుధ, యల్లమ్మ, దుర్గమ్మ, శృతి తదితరులు పాల్గొన్నారు.


