అంగన్‌వాడీ కార్యకర్తలకు పెన్షన్ ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు, సహాయకులకు పింఛన్ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. 2011 నుంచి 2023 వరకు పదవీ విరమణ చేసిన 10,311 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు, 11,980 మంది సహాయకులకు కలిపి మొత్తం రూ.183 కోట్లు ఆర్ధిక శాఖ నుంచి విడుదల చేయించడంలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాచ్యుటీ, జనరల్ ప్రావిడెంట్ పంఢ్‌లను పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నర్మద, గంగమ్మ, మహాలక్ష్మి, శకుంతల, జయలక్ష్మి, నరసమ్మ, పార్వతి, వీరేష్, శరణ బసవలున్నారు.


