నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
సాక్షి,బళ్లారి: నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి సన్నిహితుడు, కాంట్రాక్టర్ సతీష్‌రెడ్డి నుంచి తనకు ప్రాణభయం ఉందని, మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఆప్తసహాయకుడు, ముఖ్య అనుచరుడుగా గుర్తింపు పొందిన అలీఖాన్ ఎస్పీ శోభారాణికి ఫిర్యాదు చేశారు. బుధవారం ఆయన బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ తదితరులతో కలిసి ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు సతీష్‌రెడ్డి ఫోన్‌లో సంభాషించుకున్న ఆడియోను కూడా అందజేశారు. వివరాలు.. అలీఖాన్ మాటల్లో తాను బెంగళూరులోని వసంతనగర్ కార్యాలయంలో ఉన్నప్పుడు తనకు బాగా తెలిసిన యాళ్పి బాషా అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. అప్పుడు ఫోన్ రిసీవ్ చేయడానికి సమయం లేకపోవడంతో మళ్లీ కాల్ చేయగా ఆ వ్యక్తి మరొక వ్యక్తి(సతీష్‌రెడ్డి) మాట్లాడతారని చెప్పారన్నారు.
ఫోన్‌లో నానా దుర్భాషలాడారు
తాను వెంటనే హలో అనడంతో ఉన్నఫళంగా తెలుగులో పత్రికల్లో రాయలేని భాషను ఉపయోగించి, నానా బూతులు తిట్టారని తెలిపారు. బళ్లారికి వస్తే నీ అంతు చూస్తానని బెదిరించారన్నారు. తాను కూడా అదే భాషలో మాట్లాడానని, తనకు ప్రాణభయం ఉందని వివరించారు. తనకు పరిచయం ఉన్న వ్యక్తి కదా అని ఫోన్ రిసీవ్ చేశానని, మళ్లీ కాన్ఫరెన్స్ కాల్‌లో 9513333339 నంబరు నుంచి ఫోన్ చేసి తనను బూతులు తిట్టారన్నారు. రాజకీయంగా పలుకుబడి కలిగి ఉన్నారని, ఆయన మాట తీరు చూస్తుంటే తనను ఏ క్షణంలోనైనా ఏమైనా చేయవచ్చనే భయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని, తన ప్రాణాలకు ఏమైనా జరిగితే వారే బాధ్యులని తెలిపారు. సతీష్‌రెడ్డితో తనకు పరిచయం కూడా లేదని, ఆయన ముఖం కూడా చూడలేదని తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదని, చట్టపరంగా పోరాడేందుకు వీలుగా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.
నగరంలో శాంతిని కాపాడాలి
– మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి
ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న బళ్లారిలో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నించకూడదన్నారు. అలీఖాన్ తమ బీజేపీ కార్యకర్త. ఆయనకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అలీఖాన్‌ను ఫోన్ ద్వారా సతీష్‌రెడ్డి నానా బూతులు తిట్టి, బెదిరించారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. శాంతియుతంగా ఉన్న బళ్లారిలో అశాంతి రేకెత్తించడం ఎంత మాత్రం సహించలేనిదన్నారు.
మేము భయపడేది లేదు
– మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ
మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటికే వ్యాపారులతో పాటు పలువురిని బెదిరించారన్నారు. బెదిరిస్తే భయపడతారని, ఇష్టారాజ్యంగా పాలన చేయవచ్చని భావిస్తున్నారన్నారు. గాలి జనార్దనరెడ్డి ఆప్త సహాయకుడినే బెదిరిస్తే నగరంలో అందరూ భయపడతారని అనుకుంటున్నారని మండిపడ్డారు. తమకు ఎవరి భయం లేదన్నారు. అలాంటి వారి వ్యక్తిత్వం తెలుస్తుందనే ఉద్దేశ్యంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి పీఏ అలీఖాన్
ఎమ్మెల్యే సన్నిహితుడు సతీష్‌రెడ్డిపై ఫిర్యాదు
ఫోన్ ద్వారా పత్రికల్లో రాయలేని భాషతో తిట్టారు
బీజేపీ నేతలతో కలిసి ఎస్పీకి
విన్నవించిన వైనం
నగరంలో చర్చనీయాంశమైన ఫోన్ సంభాషణ


