యోగా, ధ్యానంతో మానసిక ఆరోగ్యం
హొసపేటె: శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం అని, యోగా, ధ్యానం ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చీఫ్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సుబ్రహ్మణ్య అన్నారు. బుధవారం మాతా శిశు ఆస్పత్రి ఆవరణలోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయ హాలులో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేసి ఒత్తిడి లేని జీవనశైలిని అవలంబించాలన్నారు. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించడం, చెడు అలవాట్లు లేని కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ఆనందం పెరుగుతుందన్నారు. ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. అసమతుల్య ఆహారంతో శరీరంలో జడత్వం పెరుగుతుందన్నారు. శారీరక ఆరోగ్యాన్ని కోల్పోతే మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపూర్ తదితరులు పాల్గొన్నారు.


