డ్రగ్స్ దందా మీకు తెలుసు, దానిని అరికట్టాలి
శివాజీనగర: డ్రగ్స్ విముక్త కర్ణాటక ప్రకటనగానే మిగిలిపోకుండా పటిష్టంగా అమలు చేయడానికి పోలీసులు అంకితభావంతో పని చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. డ్రగ్స్ విముక్త కర్ణాటక నా లక్ష్యం. ఇది మీ లక్ష్యం కూడా కావాలి అన్నారు. మంగళవారం విధానసౌధలో రాష్ట్ర పోలీసు కానిస్టేబుళ్లకు కొత్త క్యాప్‌ను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాదక ద్రవ్య వ్యతిరేక కార్యచరణ ప్రారంభం, సన్మిత్ర కార్యపథకం డైరీనీ విడుదల చేశారు. డ్రగ్స్ దందా ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పోలీసులకు తెలిసే ఉంటుంది. దానిని అంతం చేసేందుకు శ్రమించాలని సూచించారు. డ్రగ్స్ ఎవరు తెస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు అనేది మీకు తెలిసే ఉంటుంది. ఈ దందాను నిర్మూలించాలన్నారు. మత్తు భూతానికి మన యువశక్తి, విద్యార్థులు బలి కాకూడదన్నారు.
దక్షిణ కన్నడ జిల్లాలో అదుపు చేశాం
దక్షణ కన్నడ జిల్లాలో మత ఘర్షణలు, మోరల్ పోలీసింగ్ కార్యకలాపాలు అధికమయ్యాయి, గతంలో ఉన్న అధికారులు నియంత్రించలేదు. ఇద్దరు అధికారులను బదిలీ చేశాం, ఇప్పుడు జిల్లా నియంత్రణలో ఉంది అని సీఎం అన్నారు. మీరు సాధన చేస్తే కర్ణాటక పోలీస్ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి జీ.పరమేశ్వర్, సీఎస్ శాలిని రజనీశ్, డీజీపీ ఎం.ఏ.సలీం, ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు పాత స్లోజ్ టోపీలకు బదులు నీలి రంగు పీక్ క్యాప్‌లలో కనిపిస్తారు.
పోలీసులకు సీఎం సిద్దు పిలుపు
కానిస్టేబుళ్లకు కొత్త క్యాప్‌ల పంపిణీ
డ్రగ్స్ దందా మీకు తెలుసు, దానిని అరికట్టాలి


