సమాజ సేవలతోనే జవాబు: సుధామూర్తి
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిస్తున్న కులగణన సర్వేకు వివరాలు ఇవ్వకుండా ఇన్ఫోసిస్ ముఖ్యురాలు, ఎంపీ సుధామూర్తి నిరాకరించడం తెలిసిందే. ఈ విషయమై సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. ఇన్ఫోసిస్ ఏమైనా బృహస్పతా? అని మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం వాడీవేడిగా మారింది. ఈ నేపథ్యంలో హుబ్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుధా మూర్తి మీడియాతో మాట్లాడారు. సర్వేలో పాల్గొనక పోవడంపై తలెత్తిన విమర్శలకు తన సమాజ సేవల ద్వారానే సమాధానం చెబుతానని అన్నారు. తాను హుబ్లీలో చదివిన జ్ఞానభారతి పాఠశాలను రూ.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయించినట్లు తెలిపారు. చదువుకున్న పాఠశాల, గురువులను జ్ఞాపకం చేసుకోవడం, వారిపై భక్తిప్రపత్తులతో నడుచుకోవడం ఇటీవల సమాజంలో తగ్గుముఖం పడుతోందని వాపోయారు. ప్రతికూల మనస్తత్వం పెరిగిపోయిందన్నారు. తాను చిన్నప్పడు చదివిన సదరు పాఠశాలలో నాణ్యతతో కూడిన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
సంబరాలలో విషాదం
హుబ్లీ: దీపావళి పండుగ సంబరాల్లో విషాదం తాండవించింది. బాగళకోటె జిల్లా బాగళకోటె తాలూకాలోని గద్దనకేరి క్రాస్‌లో ఉన్న ఓ ఇంట్లో దీపావళి సందర్భంగా దీపాలను వెలిగిస్తున్న క్రమంలో అగ్నిప్రమాదంలో గాయపడిన యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలు స్నేహ మేదర (22). పండుగ నాడు గాయపడిన యువతిని కుటుంబీకులు బెళగావిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలిన గాయాల తీవ్రతకు ఆమె కోలుకోలేక మంగళవారం ఆస్పత్రిలోనే కన్నుమూసింది.
హడావుడి లేని తుపాను
శివాజీనగర: మొంథా తుపాను నేపథ్యంలో రాష్ట్రంలో 11 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కన్నడ, ఉడుపి, దక్షిణ కన్నడ, బీదర్, కల్బుర్గి, యాదగిరి, విజయపుర, బాగలకోట, రాయచూరు, కొప్పళ, గదగ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. దక్షిణ ఒళనాడు, ఉత్తర ఒళనాడులో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బెంగళూరులో తుపాను ఎలాంటి ప్రభావం చూపించలేదు. మబ్బులు కమ్ముని చల్లని గాలులు వీచాయి. అప్పుడప్పుడు చిరుజల్లులు పడ్డాయి. ప్రజలు వెచ్చగా ఉండే దుస్తులను ఆశ్రయించారు. జన జీవనం సాధారణంగానే సాగింది. ఎక్కడలేని హడావుడి చేసిన మొంథా తుపాను కన్నడనాట పెద్ద ప్రభావం చూపించలేదు.
గిరిజా కళ్యాణోత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు సమీపంలో ఆనేకల్ తాలూకాలో నారాయణఘట్టలో వెలసిన ప్రసన్న నంజుండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గిరిజా కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను పందిరిలో కొలువుదీర్చి సుందరంగా అలంకరించి వేదమంత్రాలతో వేడుకను సాగించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
నకిలీ చెక్కులు
ఇచ్చి రూ.50 వేలు టోపీ
● బెంగళూరులో కొత్త దందా
యశవంతపుర: బెంగళూరులో బీబీఎంపీ, గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పేర్లతో ఉత్తుత్తి చెక్‌ల దందా వెలుగులోకి వచ్చింది. కొందరు మోసగాళ్లు.. ప్రభుత్వ సహాయం పేరుతో అమాయకులకు టోపీ వేస్తున్నారు. పాలికె నుంచి రూ.3 లక్షల ఆర్థిక సహాయం చెక్కు ఇది అని ముట్టజెప్పి రూ.50 వేల చొప్పున కొట్టేస్తున్నారు. ఇలా కొంతమందికి నకిలీ చెక్కులను అంటగట్టారు. చెక్కుపై బీబీఎంపీ కమిషనర్ సంతకం, సీల్ ఉన్నాయి, బాధితులు చెక్కును క్యాష్ చేసుకుందామని బ్యాంకులకు వెళ్లగా నకిలీవని బయట పడింది. మాకు రూ.50 వేలు ఇవ్వండి, మీకు 3 లక్షల సాయం చేయిస్తాం, ఆ డబ్బును మళ్లీ బీబీఎంపీకీ చెల్లించవలసిన అవసరం లేదు అని మోసగాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. బాధితులు లబోదిబోమంటూ గ్రేటర్ ఆఫీసులకు వెళ్లగా, ఈ చెక్కులతో తమకు సంబంధం లేదని అధికారులు చెప్పారు. ఇంత జరుగుతున్నా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విశేషం.
సమాజ సేవలతోనే జవాబు: సుధామూర్తి


