వాకర్‌ అడ్డువచ్చి.. ఇద్దరు బలి | - | Sakshi
Sakshi News home page

వాకర్‌ అడ్డువచ్చి.. ఇద్దరు బలి

Oct 29 2025 8:35 AM | Updated on Oct 29 2025 8:35 AM

వాకర్

వాకర్‌ అడ్డువచ్చి.. ఇద్దరు బలి

దొడ్డబళ్లాపురం: రోడ్డు మీద ఇష్టానుసారం వాకింగ్‌ చేయడం, వాహనాల అతి వేగం రెండు జీవితాలను బలి తీసుకుంది. హిట్‌ అండ్‌ రన్‌కు ఇద్దరు యువకులు బలైన సంఘటన దొడ్డ తాలూకా రామయ్యనపాళ్య వద్ద జరిగింది. దొడ్డ తాలూకా తూబుగెరె గ్రామానికి చెందిన నందన్‌ (22), రవికుమార్‌ (24) దొడ్డబళ్లాపురం–దేవనహళ్లి మార్గంలో ఉన్న ఎల్‌ అండ్‌ టీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరూ బైక్‌పై ఫ్యాక్టరీకి బయలుదేరారు. దారి మధ్యలో రామయ్యనపాళ్య వద్ద వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా అడ్డురావడంతో అతడిని తప్పించబోయి అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన అపరిచిత వాహనం వారిద్దరిపై దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన యువకులు అక్కడే మరణించారు. అపరిచిత వాహనం పరారైంది. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆపద్బాంధవులు కాపాడారు

దొడ్డబళ్లాపురం: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలోకి పడిన చిన్నారిని ఆపద్భాంధవుల్లా యువకులు కాపాడిన సంఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల తాలూకా దేరళకట్టె గ్రామంలో జరిగింది. వివరాలు.. ఆదివారం సాయంత్రం గురుప్రసాద్‌ అనే వ్యక్తి కుమార్తె రెండున్నరేళ్ల హిమాని ఇంటి ముందు ఆడుకుంటూ అక్కడే ఉండే 15 అడుగుల లోతుగల బావిలోకి పడిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన బాలిక చిన్నాన్న జీవన్‌ బావిలోకి తాడు వదిలాడు, అతని స్నేహితులు వివేక్‌, ధనుంజయ్‌ కూడా కలిసి పాపను కాపాడారు. సమయస్ఫూర్తితో రక్షించారంటూ గ్రామస్తులు అభినందించారు.

ప్రైవేటు బస్సులో రూ.కోటి సీజ్‌

యశవంతపుర: గోవా నుంచి బెంగళూరుకు అక్రమంగా ప్రైవేట్‌ బస్సులో కోటి రూపాయలను తరలిస్తుండగా ఉత్తర కన్నడ జిల్లా కారవార–గోవా సరిహద్దులోని మజాళి చెక్‌పోస్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు. చెక్‌పోస్టులో పోలీసులు తనిఖీలు చేయగా గోనె సంచిలో దాచిన నోట్ల కట్టలు లభించాయి. బెంగళూరుకు చెందిన కల్లేశ, రాజస్థాన్‌కు చెందిన బమరరామ్‌లు ఈ డబ్బు తరలిస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కల్లేశ, బరమరామ్‌లు గోవాలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకొని బెంగళూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. చిత్తాకుల పోలీసులు నగదు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు.

మొబైల్‌ షోరూం దొంగల అరెస్టు

యశవంతపుర: ప్రియురాలితో కలిసి ఐఫోన్‌ వంటి ఖరీదైన మొబైల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురిని వర్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దివాస్‌ కమి, ఆరోహన్‌ థాపా, అస్మిత ను పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.30 లక్షలు విలువగల 17 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ కూడా నేపాల్‌, ఉత్తరాది ప్రాంతానికి చెందినవారు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చారు. అస్మిత భర్తను వదిలేసి ప్రియుడు దివాస్‌తో కలిసి ఆరు నెలల నుంచి వర్తూరులో ఉంటోంది. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేస్తున్నారు. దివాస్‌ స్నేహితుడు ఆరోహన్‌తో కలిసి పెద్ద పెద్ద షోరూంలకు కన్నం వేస్తున్నారు. వర్తూరు పరిధిలో ఒకే సంస్థకు చెందిన రెండు షోరూముల్లో ఒకేరోజు దొంగతనాలకు పాల్పడారు. చోరీ చేసిన మొబైళ్లను అస్మిత అమ్మేసింది. ముగ్గురినీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఎం మార్పు లేదు: హోంమంత్రి

దొడ్డబళ్లాపురం: సీఎం సిద్దరామయ్యకు హోంమంత్రి పరమేశ్వర్‌ బాసటగా నిలిచారు. 5 ఏళ్లూ సిద్ధరామయ్యే సీఎంగా ఉంటారు, రెండున్నరేళ్లు మాత్రమే అని ఎవరూ చెప్పలేదని హోంమంత్రి అన్నారు. మంగళవారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు అందరూ 5 ఏళ్లపాటు సిద్ధరామయ్య కుర్చీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ సమావేశంలో రెండేళ్లు, మూడేళ్లు అని తీర్మానం చేయలేదన్నారు. సీఎం విషయంలో హైకమాండ్‌ అంతిమ నిర్ణయం ప్రకటిస్తే మంచిదని అన్నారు.

వాకర్‌ అడ్డువచ్చి.. ఇద్దరు బలి   1
1/1

వాకర్‌ అడ్డువచ్చి.. ఇద్దరు బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement