వివాదాల సొరంగ మార్గం
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగరంలో నిర్మించతలపెట్టిన బృహత్ సొరంగ మార్గం రహదారి పథకం వివాదాలకు కేరాఫ్‌గా మారింది. ఈ పథకం వద్దే వద్దని ప్రతిపక్ష బీజేపీ నేతలు హఠం చేస్తున్నారు. సొరంగ రోడ్డు నిర్మాణం లాల్‌బాగ్ ఉద్యానవనం కిందుగా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఈ మలుపును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేస్తామని అధికార పక్షం హామీనిస్తోంది.
భూమి లోపలే పనులు
చాలావరకు భూమి లోపలే సొరంగ మార్గం నిర్మాణం జరుగుతుంది, కొన్ని చోట్ల మాత్రం భూమి పైన పనులు సాగుతాయని అధికారులు తెలిపారు. భూమిపై ఉన్న కట్టడాలు, ఉద్యానవనాలు, రోడ్లు ఇలా వేటికీ ఇబ్బంది రాదని అన్నారు. లాల్‌బాగ్ పార్కుకు ఎలాంటి హాని కలగదని చెప్పారు. లాల్‌బాగ్ కింద వందల అడుగుల పొడవులో మాత్రమే సొరంగ దారి వెళుతుందని, అందువల్ల ఎలాంటి ముప్పు కలగదని అన్నారు. లాల్‌బాగ్ లోపల ప్రాంతంలో నిర్మాణ యంత్రోపకరణాలను ఉంచేందుకు ఒక ఎకరా స్థలాన్ని మాత్రమే ఉపయోగిస్తామని, పనులు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ఎకరా స్థలాన్ని యథావిధిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీనిస్తోంది.
లాల్‌బాగ్‌కు గుదిబండ
ఈ సొరంగ నిర్మాణంపై కేవలం ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా పౌర సంఘాలు, పర్యావరణ ప్రేమికులు, లాల్‌బాగ్‌లో వాకింగ్ చేసే నగరవాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. లాల్‌బాగ్ అడుగున బండలను తొలుచుకుంటూ సొరంగం సాగితే పార్కు ఛిన్నాభిన్నం అవుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగడం సరికాదని అన్నారు. ఈ ప్రాజెక్టు కార్లు ఉన్న వారికే ఉపయోగపడుతుంది కానీ సామాన్య, మధ్యతరగతి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని అన్నారు.
వద్దంటున్న ఎంపీ తేజస్వి
కార్ల రహదారికి వేలాది కోట్లాది రూపాయలు వ్యర్థం చేయడం అవసరమా అంటూ నగర సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య మండిపడ్డారు. ఆయన మొదటి నుంచీ ఈ ప్రాజెక్టు అంటే మండిపడుతున్నారు. నటుడు ప్రకాశ్ బెళవాడి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును ఎంపీ తేజస్వీ సూర్య లాయర్‌గా వాదించనున్నారు. చారిత్రక లాల్‌బాగ్ ఉద్యానవనంలో ఎన్నో చెట్లకు హాని జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సొరంగ మార్గం నమూనా
నిర్మాణ మార్గం మ్యాప్
బెంగళూరులో సిల్క్‌బోర్డు నుంచి హెబ్బాళ వరకు..
18 కిలోమీటర్లు భూమిలో
టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు
లాల్‌బాగ్ పార్కు కింద నుంచి
వెళ్లనున్న సొరంగం
బీజేపీ సహా పలువురి వ్యతిరేకత
ఎవరొచ్చినా ఆపేది లేదు: డీసీఎం
సొరంగ నిర్మాణం కారణంగా 90 నిమిషాల ప్రయాణం 20–25 నిమిషాల్లో పూర్తవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఇది కనుక సాకారమైతే ప్రపంచస్థాయి సొరంగ మార్గాల్లో బెంగళూరు చేరుతుందని చెబుతోంది. సొరంగం పనులు ఆపడం ఎవరి తరం కాదు.. ఆపితే ఆ దేవుడు మాత్రమే ఆపాలి.. ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు ఎవరూ వ్యతిరేకించినా ప్రజలకు ఉపయోగపడే ఈ సొరంగం పనులు ఆపే ప్రసక్తే లేదు అని నగరాభివృద్ధి మంత్రి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
ఎక్కడి నుంచి ఎక్కడికి?
హెబ్బాళ నుంచి నేషనల్ సిల్క్ బోర్డు ఇన్‌స్టిట్యూట్ జంక్షన్ వరకు సొరంగ రోడ్డు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. బెంగళూరు నడిబొడ్డున ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ పథకం అవసరమని చెబుతోంది. ఉత్తరం నుంచి దక్షిణానికి కలిపే ఈ మార్గం సుమారు 18 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సిల్క్ బోర్డు నుంచి హెబ్బాళ వరకూ నిర్మాణమవుతుంది. ఈ సొరంగ దారిలో కార్లు మాత్రమే ప్రయాణిస్తాయని సర్కారు తెలిపింది.
వివాదాల సొరంగ మార్గం
వివాదాల సొరంగ మార్గం


