ఆర్‌ఎస్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట
బనశంకరి: ఈ నెలలో రాష్ట్రంతో పాటు దేశంలో తీవ్ర చర్చ రేకెత్తించిన అంశం ఏదైనా ఉందా అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడి చేయడమే. మొట్టమొదట ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. పబ్లిక్ ప్లేసుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని సీఎం సిద్దరామయ్యకు లేఖ రాయడంతో అలజడి ఆరంభమైంది. తరువాత సీఎం ఆ లేఖ ప్రకారం నిబంధలను తీసుకొచ్చారు. సంఘ్ ర్యాలీ జరపాలంటే రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అనుమతులు తీసుకోవాలని పలురకాల నిబంధనలను ప్రకటించడంతో చిచ్చు రేగింది. దీనికి విరుద్ధంగా పలువురు సంఘ్ నాయకులు హైకోర్టులో ధార్వాడ బెంచ్‌లో కేసులు వేశారు. ఈ విచారణ ఇదివరకే రెండుసార్లు జరిగి తీర్పు రిజర్వు అయ్యింది. మంగళవారం హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న.. ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ స్టేతో రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు ఎదురైంది. ఈ పోరాటంలో సంఘ్‌దే పైచేయిగా నిలిచింది.
రాజ్యాంగ విరుద్ధం...
10 మంది కంటే ఎక్కువమంది చేరి రోడ్లు, పార్కులు, మైదానాలు, చెరువులు మొదలైన ప్రదేశాల్లో కవాతు నిర్వహించరాదని సర్కారు ఇటీవల ప్రకటించింది. ఇది అక్రమమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పలు ఉదాహరణతో వాదించారు. రాజ్యాంగానికే విరుద్ధమని అన్నారు.
హక్కును కాలరాయొద్దు: న్యాయమూర్తి
రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రభుత్వం కాలరాయరాదని జడ్జి పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కు ను ప్రభుత్వం ఒక్క ఆదేశంతో లాక్కోవడం సాధ్యం కాదని పేర్కొంటూ మధ్యంతర స్టేని జారీచేశారు. ఈ సమయంలో వాదనలకు ఒకరోజు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ వకీళ్లు కోరగా, మీకు నోటీస్ ఇస్తాము, అప్పుడు వాదించండి అని స్పష్టంచేసి వాయిదా వేశారు.
అప్పీల్ చేస్తాం: సీఎం
హైకోర్టు ఆదేశాలను ప్రశ్నిస్తూ అప్పీల్ చేస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. విధానసౌధలో విలేకరులతో సిద్దరామయ్య మాట్లాడుతూ స్టే తొలగింపునకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ ఈ తీర్పు తమకు వ్యతిరేకం కాదని, ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేస్తామని చెప్పారు.
హైకోర్టు
ర్యాలీలపై విధించిన ఆంక్షల
మీద స్టే జారీ
సిద్దరామయ్య సర్కారుకు ముఖభంగం
ఆర్‌ఎస్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట


