ఉసురు తీసిన కుటుంబ కలహాలు
సాక్షి, బళ్లారి: ముక్కుపచ్చలారని ఇద్దరు పసికందులను, ఆటలాడించి ఓదార్చి పెంచాల్సిన కన్నతల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి తన పసికందులను ఉరి వేసి, తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఎందరినో కలిచివేసింది. కొప్పళ జిల్లా కుకనూరు సమీపంలోని బెణకల్లు గ్రామానికి చెందిన హనుమేష్ భజంత్రీ భార్య లక్ష్మవ్వ(30) అనే మహిళ తన ఇద్దరు పసికందులైన రమేష్(3), జాహ్నవి(1)లను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసి చంపింది. అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చుట్టుపక్కల వారికి తెలియడంతో కుక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జిల్లా ఎస్పీ అరసిద్ధి, కలబుర్గి డీఎస్పీ, స్థానిక పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కుకనూరు గ్రామంలో ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. కుటుంబ కలహాలతో లక్ష్మవ్వ ఆత్మహత్య చేసుకుందన్న ప్రాథమిక సమాచారంతో స్థానిక పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
కొప్పళ జిల్లా బెణకల్లులో
తల్లీబిడ్డల బలవన్మరణం
ముక్కుపచ్చలారని చిన్నారులను
ఉరి వేసి చంపిన తల్లి
ఆపై తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న వైనం
ఉసురు తీసిన కుటుంబ కలహాలు


