పేకాట కేంద్రాలపై మెరుపు దాడి
సాక్షి, బళ్లారి: దీపావళి పండుగ నేపథ్యంలో పేకాటరాయుళ్లు జిల్లాలో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు మెరుపుదాడి చేసి దాదాపు రూ.17,31,140లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. గత మూడేళ్లుగా దీపావళి పండుగ సందర్భంగా పేకాట నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఎంతెంత నగదు స్వాధీనం చేసుకొన్నారో పేర్కొన్నారు. 2023లో 101 కేసులు నమోదు కాగా రూ.10,83,800లను స్వాధీనం చేసుకొన్నామన్నారు. 2024లో 137 కేసులు నమోదు కాగా రూ.16,44,665లను స్వాధీనం చేసుకొన్నామన్నారు. పండుగల నేపథ్యంలో పేకాట నిర్వహించే వారిపై జిల్లా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
టపాసుల పేలుళ్లలో
ఇద్దరికి గాయాలు
హొసపేటె: దీపాల పండుగ దీపావళి సందర్భంగా బుధవారం రాత్రి ఓ ఇంటి సమీపంలో టపాసులు పేలుస్తుండటంతో ఇద్దరు పిల్లల ముఖాలపై తీవ్ర గాయాలయ్యాయి. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటె గ్రామానికి చెందిన రుద్రేష్ సుజాత దంపతుల కుమారుడు కుమార్(9), తిప్పేస్వామి కుమార్తె రేణుక (10) అనే ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర వదిలి పెట్టిన బాణసంచా కాగితపు ముక్కలను పోగు చేసి వెలిగించబోగా బాణసంచా పేలి, నిప్పురవ్వలు వీరిద్దరి కళ్లు, ముఖంపై పడటంతో గాయాలయ్యాయి. బాలుడిని వెంటనే బళ్లారిలోని బిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక రేణుక గుడేకోటె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని బాలిక తండ్రి తిప్పేస్వామి తెలిపారు.
కవాతుకు సంఘాల పోటీ
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపురలో ఆర్‌ఎస్‌ఎస్ కవాతుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు చిత్తాపురలో మూడు సంఘాల నుంచి కలబుర్గి జిల్లాధికారికి దరఖాస్తులు అందాయి. చిత్తాపురలో ఆర్‌ఎస్‌ఎస్, భీమ్ ఆర్మీ, కురుబ సమాజం, దళిత ప్యాంథర్‌లు నవంబర్ 2న ఒకే రోజు కవాతుకు మూడింటికి అవకాశం ఇవ్వాలంటూ అర్జీలను జిల్లాధికారిణి ఫౌజియ తరన్నంకు విన్నవించారు. ఈ విషయంపై ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్ కలబుర్గి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేసిన సంగతి విదితమే.
పేదల చదువుకు అడ్డంకి వద్దు
రాయచూరు రూరల్: సమాజంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి అడ్డంకి రాకూడదని ఈడీఆర్‌టీ సంస్థ సంచాలకురాలు రత్న పేర్కొన్నారు. గురువారం తాలూకాలోని పంచముఖి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 250 బ్యాగులు, 1080 నోటు పుస్తకాలు, వంద ప్లేట్లు, వంద గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రాధాన్యత కల్పించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిద్దాలన్నారు.
మహిళా ఎస్‌ఐపై
లైన్‌మెన్ దాడి.. అరెస్ట్
హుబ్లీ: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐపై రైల్వే లైన్‌మెన్ దాడి చేసి పోలీసు వాహనానికి హాని కలిగించిన ఘటన నవలగుంద బస్టాండ్ దగ్గర హుబ్లీ– విజయపుర హైవేలో వెలుగు చూసింది. బాధ్యుడిని అరెస్ట్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కవాతు వేళ భద్రత కోసం విచ్చేసిన అణ్ణిగేరి ఎస్‌ఐ ఉమాదేవిపై నవలగుంద తాలూకా గుడిసాగర నివాసి ద్యామనగౌడ కులకర్ణి బైక్‌లో వచ్చి పోలీస్ వాహనాన్ని ఢీకొన్నాడు. అంతేగాక ఆమె ఎస్‌ఐను అసభ్యంగా దుర్భాషలాడి నిందించాడు. కాలిపై కొరికి గాయపరిచాడని ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనపై నవలగుంద పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.
సీఐపై అవినీతి కేసు నమోదు
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో నిధి తవ్వే విషయంలో నలుగురు నిందితులను పట్టించిన వారి వద్ద నుంచి లంచం తీసుకున్న ఆరోపణలపై సురపుర సీఐపై కేసు నమోదైన ఘటన చోటు చేసుకుంది. సురపుర తాలూకా నాగరాళలో గుప్త నిధులున్నాయని, వాటిని తీసి ఇస్తామని మోసం చేసిన వ్యక్తులు, డబ్బులను రెండింతలు చేసి ఇస్తామని చెబుతూ నమ్మించిన రామణ్ణ గౌడ, నాగయ్య స్వామి, వగ్గ నింగయ్య, భీమణ్ణ ఇతరుల నుంచి డబ్బులు వసూలు చేసి స్వామిని పిలిపించి పనులు చేయిస్తామంటూ పట్టించిన నిందితులను సీఐ ఉమేష్ నాయక్ రూ.10 లక్షలు లంచం తీసుకొని వదిలిపెట్టినట్లు ఎస్సీ, ఎస్టీ సమితి అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ ఎస్పీ పృథ్వీశంకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీఐపై ఎస్పీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆస్పత్రి ఆవరణం వర్షార్పణం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటె ఆస్పత్రి ఆవరణం గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి వాన నీటితో నిండింది. ఆస్పత్రికి వచ్చే రోగులు వాన నీటిలోనే నడవాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఇక్కడ నీరు నిలిచిపోవడంతో రోగులకు నరకయాతనగా మారింది. ఈ ప్రాంతంలో ఈ ఏకై క ఆస్పత్రి ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం వందలాది రోగులు ఆస్పత్రికి వస్తారు. వర్షం పడినప్పుడు తాము ఆస్పత్రికి వెళ్లాలంటే వర్షం నీటిలో అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉందని, ఈ విషయంపై ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
పేకాట కేంద్రాలపై మెరుపు దాడి


