రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారులు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులు గోతులమయంగా మారాయి. ఈ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్లూరు, నీరమాన్వి, మాన్వి, సింధనూరు, సిరవార, కవితాళ, లింగసూగూరు, రాయచూరు, శక్తినగర్, గిల్లేసూగూరులకు వెళ్లే రహదారులు గుంతలు పడ్డాయి. గత శాసనసభ ఎన్నికల్లో గెలిచిన శాసన సభ్యులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. శాసన సభ్యులు, మంత్రులు రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించక కాలహరణం చేయడంతోనే సరిపోయిందని ప్రజలు వాపోయారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు హరీ
వారం రోజుల్లోనే ఆరు మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2002లో అప్పటి ప్రజాపనుల శాఖ మంత్రి ధరం సింగ్ హయాంలో రాయచూరు–మాన్వి–సింధనూరు రోడ్డు పనులు చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు మరమ్మతు పనులు చేపట్టలేకపోయారు. సెప్టెంబర్‌లో నీరమాన్వి–కప్పగల్ వద్ద పాఠశాల బస్సు ప్రమాదంలో ఇద్దరు బాలురు మరణించగా, 25 మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. వారం రోజుల క్రితం కల్లూరు వద్ద ముగ్గురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. జాతీయ రహదారి– 167 బెళగావి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రాంతంలో 2025లో 616 ప్రమాదాలు జరగగా 280 మంది దుర్మరణం పాలయ్యారు.
అధ్వాన స్థితిలో ప్రధాన రహదారులు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
ఏళ్ల తరబడి మరమ్మతుకు
నోచుకోని వైనం
2025లో 616 ప్రమాదాల్లో
280 మంది మృతి
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం


