రోగుల గోస పట్టేదెవరికి?
సాక్షి, బళ్లారి: నగరంలో పేరు గాంచిన జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఓపీ రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జిల్లా ఆస్పత్రిలో కొత్త హంగులతో ప్రైవేటు ఆస్పత్రికి దీటుగా వైద్యం అందిస్తుండటంతో పాటు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే, తదితరాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నగరంలో ఓపీడీ ఆస్పత్రి తర్వాత అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన గోస ఆస్పత్రి(జిల్లా ఆస్పత్రి) ప్రముఖంగా కాన్పుల ఆస్పత్రిగా పేరుగాంచింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు స్థానికంగా ఓటర్ ఐడీ, ఇతర గుర్తింపు కార్డుతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి ముందుగా ఇక్కడ పేరు నమోదు చేసి ఓపీ చీటీ తీసుకున్న తర్వాతే ఆస్పత్రిలో చికిత్స చేయించుకొనే అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రతి నిత్యం ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయి ఓపీ చీటీల సంఖ్య నమోదు చేసేందుకు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. కంప్యూటర్లలో కూడా పేరు నమోదు చేయడానికి ఒక్కొక్కసారి సాంకేతిక సమస్య కూడా తలెత్తుతోంది.
రోగుల బాధలు వర్ణనాతీతం
ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఓపీ చీటీ తీసుకోవడానికి రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలకు వైద్యులు మెరుగైన చికిత్సలను అందిస్తున్నా ముందుగా ఓపీ చీటీ తీసుకోడానికి గంటల తరబడి వరుస(క్యూ)లో నిలబడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో అత్యవసర చికిత్స పొందే రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ తరుణంలో గురువారం ఏఐకేకేఎంస్ జిల్లా కార్యదర్శి గురళ్లి రాజా తదితరులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు రోగులు పడుతున్న ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించి సులభంగా ఓపీ చీటీలు ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రోగులు రెండు సార్లు పేర్లు నమోదు చేసుకొనే చర్యలు చేపట్టడం సరికాదని, ఇందుకు ప్రత్యామ్నాయంగా రోగులకు ఇబ్బంది కలగకుండా జిల్లా ఆస్పత్రి పాలక మండలి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
జిల్లా ఆస్పత్రి కౌంటర్‌లో పేరు
నమోదుకు రోగులకు ఇక్కట్లు
గంటల తరబడి క్యూలో నిలిచి
ఇబ్బందులు పడుతున్న వైనం


